Shashi Tharoor: బిహార్ ప్రగతి అబ్బురపరుస్తోంది.. ఎన్డీయే ప్రభుత్వంపై శశిథరూర్ ప్రశంసలు
ABN , Publish Date - Dec 23 , 2025 | 03:59 PM
గతంలో తాను విన్న దానికంటే బిహార్‌లో మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని శశిథరూర్ అన్నారు. రోడ్డు బాగున్నాయని, ఇంతకుముందెన్నడూ లేని విధంగా అర్థరాత్రి కూడా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారని చెప్పారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అధికార బీజేపీపై ప్రశంసలు కురిపిస్తూ సొంత పార్టీ నేతల నుంచి తరచు విమర్శలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే పాలిత రాష్ట్రమైన బిహార్ అభివృద్ధిపై ప్రశంసలు కురిపించారు. బిహార్‌లో మౌలిక వసతుల కల్పనపై నితీష్ కుమార్ ప్రభుత్వం గట్టి కృషి చేస్తోందని కితాబిచ్చారు. బిహార్‌లో నితీష్ కుమార్ పార్టీ జేడీయూతో బీజేపీ పొత్తు సాగిస్తోంది.
నలందా యూనివర్శిటీ పునరుద్ధరణ అనంతరం జరిగిన తొలి నలందా లిటరరీ ఫెస్టివల్‌లో శశిథరూర్ మంగళవారంనాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో తాను విన్న దానికంటే బిహార్‌లో మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. రోడ్డు బాగున్నాయని, ఇంతకుముందెన్నడూ లేని విధంగా అర్థరాత్రి కూడా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారని, విద్యుత్, నీటి సదుపాయాలు కూడా సరిగ్గా ఉన్నాయని అన్నారు. గత కొన్నేళ్లుగా చాలా మంచిపనులు జరిగాయనడంలో సందేహం లేదని చెప్పారు.
నితీష్ కుమార్ గురించి అడిగినప్పుడు, రాజకీయాల్లోకి తనను లాగవద్దని, ఇక్కడి జరిగిన అభివృద్ధి మాత్రంచాలా సంతోషంగా ఉందని సమాధానమిచ్చారు. బీహార్ ప్రజలు, ప్రతినిధులకు ఈ క్రెడిట్ దక్కుతుందన్నారు. కాగా, బిహార్‌లో శశిథరూర్ చేసిన తాజా వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఇంకా స్పందించలేదు.
ఇవి కూడా చదవండి..
మూకదాడి ఘటనపై నిరసన.. ఢిల్లీలో బంగ్లా హైకమిషన్ వద్ద ఉద్రిక్తత
రాజ్యాంగం రద్దుకు బీజేపీ నేతల కుట్ర: రాహుల్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి