Rahul Comments on BJP: రాజ్యాంగం రద్దుకు బీజేపీ నేతల కుట్ర: రాహుల్
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:54 PM
విదేశీ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈడీ, సీబీఐ, ఈసీలను బీజేపీ సొంత ఆస్తులుగా వాడుకుంటూ ఓట్ల చోరీకి పాల్పడుతోందని ధ్వజమెత్తారు.
ఇంటర్నెట్ డెస్క్: జర్మనీ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు(Rahul Gandhi in Germany Tour). భారత రాజ్యాంగాన్ని రద్దు చేయడమే లక్ష్యంగా బీజేపీ నేతలు ఆలోచిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రాలు, భాషలు, మతాల మధ్య ఉన్న సమానత్వ భావనను దెబ్బతీస్తూ.. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను బీజేపీ(BJP) కాలరాస్తోందని ఈ సందర్భంగా మండిపడ్డారు. ప్రపంచంలో భారత్(India) అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని.. అది యావత్ ప్రపంచ సంపద అని ఈ సందర్భంగా రాహుల్ అన్నారు. దేశంలోని ఏ ప్రజాస్వామ్య వ్యవస్థపై జరుగుతున్న దాడినైనా.. దానిని అంతర్జాతీయ స్థాయి దాడిగానే పరిగణించాలన్నారు. బీజేపీ ప్రభుత్వం.. రాజ్యాంగ సంస్థల సహకారంతో రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు వాటిని ఆయుధాలుగా ఉపయోగించుకుంటోందని ఆయన ఆరోపించారు.
భారత్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI), ఎన్నికల కమిషన్(EC)ల పనితీరును లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్(Lok Sabha Opposition Leader) తీవ్రంగా తప్పుబట్టారు. బీజేపీ వాటిని సొంత ఆస్తులుగా వాడుకుంటూ.. ఓట్ల చోరీకి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. అందువల్లే ఎన్డీఏ ఎన్ని అక్రమాలకు పాల్పడుతున్నా దర్యాప్తు సంస్థలు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నాయన్నారు రాహుల్. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్ష నేతలపైనే కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నాయని చెప్పుకొచ్చారాయన. హరియాణా(Haryana) ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) గెలిచిందని తాము నిరూపించామని.. అలాగే వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఓటు చోరీ జరిగినట్టు తాను ఎన్నో రుజువులు చూపిస్తున్నా.. ఎన్నికల సంఘం మిన్నకుండిపోయిందని విమర్శించారు.
మన్మోహన్ సింగ్ కాలంనాటి ఆర్థిక విధానాలనే ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని.. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అనుసరిస్తున్న ఆర్థిక నమూనాపై కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు రాహుల్. మోదీ ఆర్థిక విధానం ప్రస్తుతం పూర్తిగా నిలిచిపోయిందన్నారు. దేశంలోని సంస్థాగత వ్యవస్థపై జరుగుతున్న ఈ దాడిని ఎదుర్కొనేందుకు తాము ప్రతిపక్షంలో ఉంటూ ఓ బలమైన ప్రతిఘటనా వ్యవస్థను రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. తమ ఇండియా కూటమిలో పార్టీల మధ్య వ్యూహాత్మకమైన విభేదాలు ఉన్నప్పటికీ.. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఎదుర్కోవడం సహా రాజ్యాంగాన్ని రక్షించడంలో కలిసికట్టుగా పనిచేస్తామమని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారాయన.
ఆయనకు అది అలవాటే: బీజేపీ
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. విదేశాల్లో ఉంటూ భారత ప్రతిష్ఠను దెబ్బతీయడం ఆయనకు అలవాటుగా మారిపోయిందని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనవాలా(BJP Spokes person Shehzad Poonawalla) విమర్శించారు. రాహుల్ విదేశీ పర్యటనలో లేరని.. భారత్‌ను అవమానించే పనిలో నిమగ్నమయ్యారని ధ్వజమెత్తారు. భారత్‌ను విమర్శిస్తూ.. చైనాకు మద్దతు తెలపడం వారికి అలవాటేనని మండిపడ్డారు. బీజేపీకి చెందిన మరో ప్రతినిధి శోభా కరంద్‌లాజే(Shobha KarandLaze) మాట్లాడుతూ.. రాహుల్ ప్రతిపక్ష నాయకుడు కాదని.. దేశ వ్యతిరేక నాయకుడని అన్నారు.
ఇవీ చదవండి: