Bangladesh High Commission: మూకదాడి ఘటనపై నిరసన.. ఢిల్లీలో బంగ్లా హైకమిషన్ వద్ద ఉద్రిక్తత
ABN , Publish Date - Dec 23 , 2025 | 03:13 PM
ఢాకాలో జరిగిన ఘటనను నిరసిస్తూ ప్రదర్శకులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. వీహెచ్‌పీతో పాటు పలు హిందూ సంస్థలు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నాయి.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ (Bangladesh High Commission) వద్ద మంగళవారంనాడు తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బంగ్లాలో హిందువులపై దాడులను ఖండిస్తూ విశ్వహిందూ పరిషత్ (VHP) ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్దఎత్తున బంగ్లా హైకమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో ముందుజాగ్రత్త చర్యగా ఢిల్లీ పోలీసులు హైకమిషన్ కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రదర్శకులు బారికేడ్లను నెట్టుకుని లోపలకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఢాకాలో జరిగిన ఘటనను నిరసిస్తూ ప్రదర్శకులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. వీహెచ్‌పీతో పాటు పలు హిందూ సంస్థలు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నాయి.
బంగ్లాదేశ్‌లోని మయమన్ సింగ్ జిల్లాలో గత వారం దీపు చంద్ర దాస్ అనే 25 ఏళ్ల హిందూ యువకుడిని దుండగులు గతవారంలో దారుణంగా కొట్టిచంపారు. చెట్టుకు వేలాడదీసి ఉరితీశారు. అనంతరం మృతదేహాన్ని రోడ్డుపై పడేసి నిప్పుపెట్టారు. ఈ ఘటనపై భారత్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ దేశాలు సైతం ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. దీపు చంద్రదాస్ దారుణ హత్యతో ప్రమేయమున్న 12 మందిని బంగ్లా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.
బంగ్లాదేశ్‌లో గత ఏడాది షేక్ హసీనా ప్రభుత్వం గద్దెదిగడానికి దారితీసిన విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించిన షరీఫ్ ఒస్మాన్ హాదీపై గుర్తుతెలియని వ్యక్తులు ఇటీవల కాల్పులు జరపడం, సింగపూర్‌లో చికిత్స పొందుతూ అతను కన్నుమూయడంతో దేశ వ్యాప్తంగా హింసాకాండ చెలరేగింది. దీనికి కొనసాగింపుగా నేషనల్ సిటిజిన్ పార్టీ (NCP) యువనేత మొతలేబ్ సిక్దార్‌పై సోమవారంనాడు గుర్తుతెలియని సాయుధుడు కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో అతని తల ఎడమ వైపు తూటా దూసుకెళ్లింది. ప్రస్తుతం ఆసుపత్రిలో సిక్దార్ చికిత్స పొందుతున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్‌లో పార్లమెంట్ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
రాజ్యాంగం రద్దుకు బీజేపీ నేతల కుట్ర: రాహుల్
మదర్సా టీచర్లకు పోలీసు చర్యల నుంచి రక్షణ ఇచ్చే బిల్లు రద్దు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి