Supreme Court: సీజేఐపై దాడి చేసిన లాయర్‌పై కోర్టు ధిక్కార చర్యలకు సుప్రీం నిరాకరణ
ABN , Publish Date - Oct 27 , 2025 | 03:47 PM
కోర్టు ధిక్కార నోటీసు జారీ చేయడం వల్ల సీజేఐపై షూ విసిరిన లాయర్‌కు అనవసర ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని, ఈ ఘటన దానంతటదే సద్దుమణుగుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయ పడింది.
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ బీఆర్ గవాయ్ (Justice BR Gavai)పై ఇటీవల షూ విసిరేందుకు ప్రయత్నించిన లాయర్‌పై కోర్టు ధిక్కార చర్యలు చేపట్టేందుకు అనుమతించేది లేదని సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం నాడు పేర్కొంది. ఈ విషయంపై సీజేఐ ఎలాంటి కేసు నమోదు చేయలేదని, లాయర్‌పై చర్యలు తీసుకోవడానికి సీజేఐ విముఖత చూపించారని తెలిపింది. లాయర్‌పై కోర్టు ధిక్కారణ చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
కోర్టు ధిక్కార నోటీసు జారీ చేయడం వల్ల సీజేఐపై షూ విసిరిన లాయర్‌కు అనవసర ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని, ఈ ఘటన దానంతటదే సద్దుమణుగుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయ పడింది.
విష్ణుమూర్తి విగ్రహానికి సంబంధించిన ఒక కేసులో సీజేఐ వ్యాఖ్యలకు నిరసనగా రాకేష్ కిషోర్ అనే అడ్వకేట్ అక్టోబర్ 6న ఆయనపై షూ విసిరేందుకు ప్రయత్నించారు. భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకుని బయటకు పంపారు. సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేదంటూ రాకేష్ కిషోర్ నినాదాలు చేశారు. కోర్టులో నినాదాలు చేయడం, షూ విసిరడం కోర్టు ధిక్కారణ కిందకు వస్తుందని, అయితే దీనిపై చట్టం ప్రకారం ముందుకు వెళ్లడం అనేది సంబంధిత న్యాయమూర్తిపై ఆధారపడి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలను పరిశీలిస్తామని కూడా తెలిపింది.
ఇవి కూడా చదవండి..
తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్
డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన: CBI దర్యాప్తు అవకాశం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి