Road Accident: కుంభమేళా వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి, 19 మందికి గాయాలు
ABN , Publish Date - Feb 15 , 2025 | 09:22 AM
మహా కుంభమేళాకు వెళ్తున్న ఓ భక్తుల వాహనం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ క్రమంలో 10 మంది మరణించగా, మరో 19 మంది గాయపడ్డారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఎక్కడ జరిగిందనే విషయాలను ఇక్కడ చూద్దాం.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (road accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పది మంది భక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో 19 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన భక్తులను సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ క్రమంలో మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేయడానికి చర్యలు తీసుకున్నారు. ఈ విషాదకరమైన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ప్రయాగ్‌రాజ్ నుంచి మీర్జాపూర్ వెళ్ళే హైవేపై ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాద సమయంలో..
ఈ ప్రమాదం జరిగిన సమయంలో భక్తులతో నిండిన బొలెరో వాహనం, వేగంగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. దీంతో బొలెరోలో ప్రయాణిస్తున్న 10 మంది భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారు ఛత్తీస్‌గఢ్ కోర్బా జిల్లాకు చెందినవారు. ఈ భక్తులు సంగమ స్నానం కోసం మహా కుంభమేళా వెళ్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది భక్తులు కూడా గాయపడ్డారు. ఈ భక్తులు మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాకు చెందినవారు, వారణాసి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. గాయపడిన వారిని రామ్‌నగర్‌లోని సీహెచ్‌సీలో చేర్చారు. అక్కడ వారికి తక్షణ వైద్య సహాయం అందిస్తున్నారు.
సాక్షులు ఏమన్నారంటే..
సాక్షుల ప్రకారం బస్సు పక్కకు వెళ్తుండగా, బొలెరో వాహనం అతి వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టిందని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో చాలా మంది నిద్రపోతున్నారని, అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం మాకు భయంకరమైన అనుభవాన్ని ఇచ్చిందని బస్సులో ప్రయాణిస్తున్న రాడ్మల్ అనే భక్తుడు తెలిపారు. మృతులలో ఈశ్వరీ ప్రసాద్ జైస్వాల్, సంతోష్ సోని, భాగీరథి జైస్వాల్, సోమనాథ్, అజయ్ బంజరే, సౌరభ్ కుమార్ సోని, గంగా దాస్ వర్మ, శివ రాజ్‌పుత్, దీపక్ వర్మ, రాజు సాహు ఉన్నారు. వీరంతా ఛత్తీస్‌గఢ్ కోర్బా జిల్లాకు చెందిన వారిగా గుర్తించబడ్డారు. ఈ ఘటన గురించి పోలీసులు మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు.
సీఎం స్పందన..
ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రోడ్డు ప్రయాణాలపై..
అయితే అసలు ఈ ప్రమాదంలో తప్పు ఎవరిది, ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన బొలెరో డ్రైవర్ సహా ఇతర బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ ఘటన నేపథ్యంలో మహా కుంభమేళాకు వెళ్తున్న రోడ్డు ప్రయాణాలపై చర్చ మొదలైంది. రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన పెంచాలని పలువురు కోరుతున్నారు. అంతేకాదు ఇటివల పలువురు తెలుగు యాత్రికులు కూడా మహా కుంభమేళాకు వెళ్లివస్తున్న క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. ఆ క్రమంలో ఎనిమిది మంది హైదరాబాదీలు మరణించారు.
ఇవి కూడా చదవండి:
PM Modi: విదేశీ పర్యటన తర్వాత.. ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ
OpenAI: ఇండియాలో చాట్ జీపీటీ డేటా సెంటర్.. ఎప్పటి నుంచంటే..
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Next Week IPOs: ఈ వారం కీలక ఐపీఓలు.. మరో 6 కంపెనీల లిస్టింగ్
New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..
Read More Business News and Latest Telugu News