Rahul Gandhi CRPF: రాహుల్ గాంధీ భద్రతా ప్రోటోకాల్ పాటించడం లేదు..
ABN , Publish Date - Sep 11 , 2025 | 05:46 PM
ప్రస్తుతం రాహుల్ గాంధీకి అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ లైజన్ (ASL)తో Z+ కేటగిరీ భద్రతను కల్పిస్తున్నట్లు CRPF అధికారి తెలిపారు. Z+ ASL అనేది ఎక్కువ ప్రమాదం పొంచి ఉన్న వ్యక్తులకు అందించే అత్యున్నత స్థాయి రక్షణల్లో ఒకటిగా పేర్కొన్నారు.
ఢిల్లీ: విదేశీ పర్యటనల సందర్భంగా భద్రతా ప్రోటోకాల్స్ ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ లోక్‌సభ ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీకి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) లేఖ రాసింది. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకూ CRPF లేఖ రాసింది. లేఖలో రాహుల్ గాంధీ తన భద్రతను సీరియస్‌గా తీసుకోవడం లేదని సీఆర్‌పీఎఫ్ వీవీఐపీ సెక్యూరిటీ చీఫ్ సునీల్ జూన్ ఆరోపించారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా విదేశాలకు ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు.
ఇటీవల రాహుల్ గాంధీ చేసిన విదేశీ పర్యటనల గురించీ సునీల్ జూన్ లేఖలో ప్రస్తావించారు. ఇటలీ (డిసెంబర్ 30 నుంచి జనవరి 9 వరకు), వియత్నాం (మార్చి 12 నుంచి 17 వరకు), దుబాయ్ (ఏప్రిల్ 17 నుంచి 23 వరకు), ఖతార్ (జూన్ 11 నుంచి 18 వరకు), లండన్ (జూన్ 25 నుంచి జులై 6 వరకు), మలేషియా (సెప్టెంబర్ 4 నుంచి 8 వరకు) వంటి దేశాల్లో ప్రోటోకాల్‌కు విరుద్ధంగా ఆయన పర్యటించారని పేర్కొన్నారు. CRPF బుక్కులోని ప్రోటోకాల్స్ ను రాహుల్ ఉల్లంఘిస్తున్నారని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం రాహుల్ గాంధీకి అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ లైజన్ (ASL)తో Z+ కేటగిరీ భద్రతను కల్పిస్తున్నట్లు CRPF అధికారి తెలిపారు. Z+ ASL అనేది ఎక్కువ ప్రమాదం పొంచి ఉన్న వ్యక్తులకు అందించే అత్యున్నత స్థాయి రక్షణల్లో ఒకటిగా పేర్కొన్నారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలతో సహా దాదాపు 55 మంది భద్రతా సిబ్బందిని రాహుల్ గాంధీ కలిగి ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. ASL కింద భద్రతా సిబ్బంది, స్థానిక పోలీసులు, నిఘా అధికారుల సమన్వయంతో వీఐపీలు సందర్శించే ప్రదేశాల్లో ముందస్తు నిఘా నిర్వహిస్తారని వెల్లడించారు.
అయితే 2023లో కశ్మీర్ యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీకి ఊహించని విధంగా భారీ జనసమూహం స్వాగతం పలికారు. అప్పుడు భద్రతా ఏర్పాట్లలో లోపాలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఆయన జనసమూహం మధ్యలో ఇరుక్కుపోయారని, దాదాపు 30 నిమిషాల పాటు కదలలేకపోయారని పార్టీ వివరించింది. తాజాగా.. డిసెంబర్ 24న దేశ రాజధానిలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్రలో భద్రతా ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తూ కొన్ని రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ లేఖ రాసిన విషయం తెలిసిందే.
కాగా, రాహుల్ గాంధీ గురించి సీఆర్ఎఫ్ లేఖ రాయడం ఇదే మొదటిసారి కాదు. 2020 నుంచి 113 సార్లు భద్రతా మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు గతంలోనూ సీఆర్‌పీఎఫ్ ఆరోపించింది.
ఇవి కూడా చదవండి
జడ్పిటీసీ ఎన్నికల్లోనే దిక్కు లేదు.. 2029 గురించి కలలెందుకు?
మరోసారి రాష్ట్రంలో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం