Rahul Gandhi: ఐపీఎస్ అధికారి ఆత్మహత్యపై నిష్పాక్షిక విచారణ జరపాలి.. రాహుల్ డిమాండ్
ABN , Publish Date - Oct 14 , 2025 | 02:59 PM
పూరన్ కుమార్ కుటుంబ సభ్యులను కలుసుకున్న అనంతరం మీడియాతో రాహుల్ మాట్లాడుతూ, ఐపీఎస్ అధికారిపై జరిగిన వివక్ష దళితులు ఎంత విజయం సాధించినా అణిచివేత తప్పదనే తప్పుడు సంకేతాలు వెళ్లేలా చేస్తుందని అన్నారు.
చండీగఢ్: హరియాణా సీనియర్ ఐపీఎస్ అధికారి (IPS Officer) వై పూరన్ కుమార్ (Y Puran Kumar) ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) డిమాండ్ చేసారు. పూరన్ కుమార్ కుటుంబ సభ్యులను రాహుల్ గాంధీ మంగళవారంనాడిక్కడ కలుసుకుని వారిని ఓదార్చారు. పూరన్ కుమార్ తన నివాసంలో తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర సంచలనమైంది. బ్యూరోక్రసీ, పోలీస్ వ్యవస్థలో కుల వివక్ష ఉందనే ఆరోపణలు మరోసారి తెరపైకి వచ్చాయి.
పూరన్ కుమార్ కుటుంబ సభ్యులను కలుసుకున్న అనంతరం మీడియాతో రాహుల్ మాట్లాడుతూ, ఐపీఎస్ అధికారిపై జరిగిన వివక్ష దళితులు ఎంత విజయం సాధించినా అణిచివేత తప్పదనే తప్పుడు సంకేతాలు వెళ్లేలా చేస్తుందని అన్నారు. ఆయన ఆత్మహత్యపై తక్షణం స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా దర్యాప్తు జరపాలని, ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని హరియాణా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఇది కేవలం ఐపీఎస్ అధికారి కుటుంబానికి సంబంధించినదని కాదని, కోట్లాది దళితుల ఆత్మ గౌరవానికి సంబంధించినదని అన్నారు. తండ్రిని కోల్పోయిన పూరన్‌కుమార్ పిల్లలు ఇద్దరూ చాలా ఒత్తిడిలో ఉన్నారని, చాలాకాలంగా ఐపీఎస్ అధికారిపై వివక్ష కొనసాగించినట్టు తెలుస్తోందని రాహుల్ అన్నారు.
పూరన్ కుమార్ అక్టోబర్ 7న రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎనిమిది పేజీల సూసైడ్ నోట్‌లో హర్యానా డీజీపీ శత్రుజీత్ కపూర్, రోహ్‌తక్ ఎస్పీ నరేంద్ర జిజర్నియాతో సహా పలువురు పేర్లు ఆయన ప్రస్తావించారు. కుల వివక్ష, మానసిక వేధింపులు, పబ్లిక్‌లో అవమానించడం వంటి చర్యలకు వీరు పాల్పడ్డారని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి..
తేల్చేసిన మాజీసీఎం.. విజయ్ పార్టీతో పొత్తు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి