Kiran Rijiju: బిహార్‌లోనూ ఖాళీ అవుతామని తెలిసే రాహుల్ ఆరోపణలు.. బీజేపీ కౌంటర్
ABN , Publish Date - Nov 05 , 2025 | 03:42 PM
హర్యానా ఎన్నికల్లో బ్రెజిలియన్ మోడల్ ఫోటోగ్రాఫ్‌ను వివిధ పేర్లతో వాడుకున్నారని రాహుల్ చేసిన ఆరోపణలను కూడా రిజిజు తోసిపుచ్చారు. 25 లక్షల నకిలీ ఓట్లున్నాయని రాహుల్ చెప్పడాన్ని రాజకీయ ఉద్దేశాలతో అల్లిన డ్రామాగా ఆయన అభివర్ణించారు.
న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్‌తో కుమ్మక్కయినందు వల్లే బీజేపీ గెలిచిందంటూ కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiran Rijiju) తిప్పికొట్టారు. రాహుల్ ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారు. బిహార్ ఎన్నికలకు ముందు 'దృష్టి మళ్లించే వ్యూహాలకు' రాహుల్ పాల్పడుతున్నారని బుధవారంనాడిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్నారు.
'రాహుల్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మీడియా ముందుకు వచ్చారు. బిహార్‌లో పోలింగ్ (గురువారం) జరుగనుండగా హర్యానా గురించి ఆయన కథలు అల్లుతున్నారు. బిహార్‌లో కాంగ్రెస్‌కు ఒరిగేదేమీ లేదనే విషయం గ్రహించే హర్యానా అశంతో జనం దృష్టి మరలించే చర్యలకు దిగారు' అని రిజిజు చెప్పారు. విపక్ష నేత సీరియస్ అంశాలు ప్రస్తావించాలే కానీ అనవసర విషయాలు ప్రస్తావించి సమయం వృథా చేయరాదని సలహా ఇచ్చారు.
బ్రెజిలియన్ మోడల్ ఫోటో
హర్యానా ఎన్నికల్లో బ్రెజిలియన్ మోడల్ ఫోటోగ్రాఫ్‌ను వివిధ పేర్లతో వాడుకున్నారని రాహుల్ చేసిన ఆరోపణలను కూడా రిజిజు తోసిపుచ్చారు. 25 లక్షల నకిలీ ఓట్లున్నాయని రాహుల్ చెప్పడాన్ని రాజకీయ ఉద్దేశాలతో అల్లిన డ్రామాగా ఆయన అభివర్ణించారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల్లో సమాచారం సేకరించి దాన్ని ఇండియాలో వర్తింపజేయాలని చూస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఓటమిని కప్పిపుచ్చుకునేందుకే రాహుల్ అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నారని, ప్రతిపక్ష నాయకునిగా బాధ్యతతో వ్యవహరించాలే కానీ అనవసర అంశాలతో సమయం వృథా చేయడం తగదని అన్నారు.
ఇవి కూడా చదవండి..
రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు.. 25 లక్షల దొంగ ఓట్లంటూ..
ఎస్ఐఆర్‌ను మీరు సపోర్ట్ చేస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా.. రాహుల్ ఆరోపణలపై ఈసీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి