OM Birla Tea Party: మోదీ, రాజ్‌నాథ్, ప్రియాంక కలిసి ఫోటో.. టీ పార్టీలో సరదా ముచ్చట్లు
ABN , Publish Date - Dec 19 , 2025 | 05:30 PM
లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ జర్మనీ పర్యటనలో ఉండటంతో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా స్పీకర్ ఇచ్చిన టీపార్టీలో పాల్గొన్నారు. విపక్షం తరఫున ప్రాతినిధ్యం వహించారు.
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు మూడువారాల పాటు వాడివేడి చర్చలు, వాకౌట్లు, నిరసనల మధ్య జరిగాయి. ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడటంతో సభలోని వాతావరణాన్ని తేలిక చేసేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (OM Birla) శుక్రవారం ఉదయం ఎంపీలందరికీ తన నివాసంలో తేనేటి విందు (Tea party)ఇచ్చారు. గత సమావేశాల మాదిరిగా కాకుండా ఈ టీపార్టీకి విపక్ష ఎంపీలు కూడా హాజరయ్యారు. స్నేహపూర్వక వాతావరణంలో సరదా ముచ్చట్లతో సభ్యులంతా సందడిగా గడిపారు.
లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ జర్మనీ పర్యటనలో ఉండటంతో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) స్పీకర్ ఇచ్చిన టీపార్టీలో పాల్గొన్నారు. విపక్షం తరఫున ప్రాతినిధ్యం వహించారు. 20 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో ఓం బిర్లా, మోదీతో పాటు రాజ్‌నాథ్ సింగ్ కూర్చుని ఉండగా ఆయన పక్కన ప్రియాంక ఆసీనులయ్యారు. తన నియోజకవర్గం వయనాడ్ నుంచి తెచ్చుకున్న ఒక మూలికను ఎలర్జీ రాకుండా తీసుకుంటూ ఉంటానని ప్రియాంక వివరించారట. మోదీ ఇటీవల జరిపిన ఇథియోపియా, జోర్డాన్, ఒమన్ పర్యటన గురించి ప్రియాంక అడగగా, బాగా జరిగిందని ఆయన బదులిచ్చారు. సమాజ్‌వాదీ పార్టీ నేత ధర్మేంద్ర యాదవ్, ఎన్‌సీపీ (ఎస్‌పీ) నేత సుప్రియా సులే, సీపీఐ నేత డి.రాజా కూడా సమావేశంలో పాల్గొన్నారు.
శీతాకాల సమావేశాలను మరికొద్ది రోజులు పొడిగించి ఉండాల్సిందని ధర్మేంద్ర యాదవ్ అభిప్రాయపడగా, ఆయనకు గొంతు నొప్పి రాకుండా ఇక్కడితో ముగించామని మోదీ సరదాగా బదులిచ్చారు. బాగా ప్రిపేర్ అయి సభకు వచ్చారంటూ ఎన్‌కే రామచంద్రన్ తదితర విపక్ష ఎంపీలను పీఎం అభినందించారు. పాత పార్లమెంటు భవనంలో మాదిరిగానే న్యూ పార్లమెంట్ బిల్డింగ్‌లో ఎంపీల కోసం ఒక సెంట్రల్ హాల్ చేర్చాలని పలువురు ఎంపీలు మోదీని కోరారు. సెంట్రల్ హాలులో ఎంపీలు, రిటైర్‌మెంట్ అయిన ఎంపీలు చర్చించుకునే వారు. దీనిపై మోదీ సరదాగా స్పందించారు. అది రిటైర్‌మెంట్ తర్వాత కదా...ఇంకా మీరు చాలా సేవ చేయాల్సి ఉంది.. అని అనడంతో సమావేశంలో నవ్వులు వెల్లివిరిసాయి
విపక్షాల హాజరుకు కారణం ఏమిటంటే?
విపక్ష పార్టీ సభ్యులను సభలో మాట్లాడేందుకు అనుమతించడం లేదని ఆరోపిస్తూ గత పర్యాయం స్పీకర్ టీ పార్టీని రాహుల్, ఇతర విపక్ష నేతలు బాయ్‌కాట్ చేశారు. అయితే ఈసారి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో విపక్షాల విషయంలోనూ స్పీకర్ సముచితంగా వ్యవహరించారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అభిప్రాయ పడ్డారని, స్పీకర్ టీపార్టీకి విపక్ష ఎంపీలంతా తప్పనిసరిగా హాజరుకావాలనే నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
రెండున్నరేళ్ల ఎగ్రిమెంట్ ఏమీ లేదు.. సిద్ధరామయ్య క్లారిటీ
ఆ సీట్ల కోసం షిండే పట్టు.. మహాయుతిలో విభేదాలు తీవ్రం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి