Priyanka Vande Mataram Debate: ప్రధాని పదవీకాలాన్ని నెహ్రూ జైలు జీవితంతో పోల్చిన ప్రియాంక
ABN , Publish Date - Dec 08 , 2025 | 06:26 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నేళ్లుగా పదవిలో కొనసాగుతున్నారో అన్నేళ్లపాటు దేశ స్వాతంత్ర్య కోసం జవహర్ లాల్ నెహ్రూ జైలు జీవితం గడిపారని ప్రియాంక గాంధీ గుర్తుచేశారు.
న్యూఢిల్లీ: దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ (Jawaharlal Nehru)పై పదేపదే ప్రధానమంత్రి, బీజేపీ విమర్శలు చేస్తుండటంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఘాటుగా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నేళ్లుగా పదవిలో కొనసాగుతున్నారో దాదాపు అన్నేళ్లపాటు దేశ స్వాతంత్ర్య కోసం జవహర్ లాల్ నెహ్రూ జైలు జీవితం గడిపారని గుర్తుచేశారు. వందేమాతర గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్లమెంటులో సోమవారంనాడు జరిగిన ప్రత్యేక చర్చలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు.
'ప్రధానమంత్రి 12 ఏళ్లుగా పదవిలో ఉన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ సైతం దేశ స్వాతంత్ర్యం కోసం దాదాపు అన్నే ఏళ్లు జైలులో గడిపారు. ఆ తర్వాత 17 ఏళ్లు ప్రధానమంత్రిగా నెహ్రూ సేవలందించారు. మీరు ఆయనపై చాలా విమర్శలు చేశారు. కానీ ఆయన (నెహ్రూ) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)ను ప్రారంభించకుంటే మీరు మంగళ్‌యాన్ చేపట్టి ఉండేవారు కాదు. ఆయన డీఆర్‌డీఓ ఏర్పాటు చేయకుంటే తేజస్‌లు ఉండేవి కావు. ఆయన ఐఐటీలు, ఐఐఎంలు ఏర్పాటు చేసి ఉండకుంటే ఐటీలో మనం ముందుకు వెళ్లగలిగే వాళ్లం కాదు. ఏఐఐఎంఎస్ ఏర్పాటు చేయకుంటే ఉంటే కరోనా సవాళ్లను ఎలా ఎదుర్కొని ఉండేవాళ్లం? పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఈదేశం కోసం జీవించారు. దేశ సేవలోనే కన్నుమూశారు' అని ప్రియాంక అన్నారు.
చర్చకు సిద్ధం
పండిట్ నెహ్రూను మోదీ ఎన్నిసార్లు అవమానించాలనుకుంటున్నారో ఒక జాబితా తయారు చేసుకోవాలని ప్రియాంక సూచించారు. '999 సార్లు కావచ్చు, 9,999 సార్లు కావచ్చు. లిస్ట్ తయారు చేసుకోండి. వందేమాతరం కోసం 10 గంటల సేపు చర్చ జరపాలని మనం అనుకున్నట్టే దీనిపై కూడా ఒక సమయం డిసైడ్ చేసుకుందాం. మీరెంత సేపు కోరుకుంటే అంతసేపు డిబేట్ చేసేందుకు మేము సిద్ధం. ఇందిర, రాజీవ్, ఆనువంశిక రాజకీయాలు, నెహ్రూ పొరపాట్లు... ఇలా అన్ని ఫిర్యాదులపైనా ప్రజలు తెలుసుకునేలా చర్చించి...ఇక మళ్లీ మళ్లీ చర్చించాల్సిన అవసరం లేకుండా దానికి ముగింపు చెబుదాం' అని ప్రియాంక సూచించారు.
ఇవి కూడా చదవండి..
జిన్నా వ్యతిరేకిస్తే నెహ్రూ సమర్థించారు.. వందేమాతరంపై చర్చలో మోదీ
వందేమాతర గీతం దేశం ముక్కలు కాకుండా కాపాడింది.. లోక్‌సభలో మోదీ..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి