Vande Mataram 150 Years: జిన్నా వ్యతిరేకిస్తే నెహ్రూ సమర్థించారు.. వందేమాతరంపై చర్చలో మోదీ
ABN , Publish Date - Dec 08 , 2025 | 03:09 PM
కాంగ్రెస్ పార్టీ ముస్లింలీగ్‌కు దాసోహం అనడం, వందేమాతర గీతాన్ని ముక్కలు చేయాలని నిర్ణయించడం దురదృష్టకరమని ప్రధాని అన్నారు. జిన్నా నిరసనకు దిగడంతో సుభాష్ చంద్రబోస్‌కు నెహ్రూ లేఖ రాశారని, గీతంలోని కొన్ని భాగాలు ముస్లింలకు నచ్చకపోవచ్చని అందులో పేర్కొన్నారని, గీతాన్ని సమీక్షించాలని కోరారని వివరించారు.
న్యూఢిల్లీ: వందేమాతరం (Vande Mataram) గీతానికి కాంగ్రెస్ పార్టీ, జవహర్ లాల్ నెహ్రూ 'అన్యాయం' చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. జాతీయ గీతం విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజీపడితే, మాజీ ప్రధాని నెహ్రూ వందేమాతర గీతంలోని కొన్ని భాగాలు ముస్లింలకు నచ్చకపోవచ్చని అన్నారని తెలిపారు. వందేమాతర గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారంనాడు పార్లమెంటులో జరిగిన ప్రత్యేక చర్చను మోదీ ప్రారంభించారు. వందేమాతర గీతానికి ఉన్న ఘన చరిత్ర, వలసపాలనకు వ్యతిరేకంగా వందేమాతర గీతం ప్రజల్లో రగిలించిన దేశభక్తి స్ఫూర్తిని వివరించారు.
కాంగ్రెస్ పార్టీ ముస్లింలీగ్‌కు దాసోహం అనడం, వందేమాతర గీతాన్ని ముక్కలు చేయాలని నిర్ణయించడం దేశ దురదృష్టమని ప్రధాని ఈ సందర్భంగా అన్నారు. జిన్నా నిరసనకు దిగడంతో సుభాష్ చంద్రబోస్‌కు నెహ్రూ లేఖ రాశారని, గీతంలోని కొన్ని భాగాలు ముస్లింలకు నచ్చకపోవచ్చని అందులో పేర్కొన్నారని, గీతాన్ని సమీక్షించాలని కోరారని వివరించారు.
వందేమాతరం రాసిన వేళ భారతదేశం బానిసత్వంలో ఉందని, 100 ఏళ్లు పూర్తయిన వేళ భారత్ రాజ్యాంగం గొంతు నొక్కేశారని, 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారని మోదీ గుర్తుచేశారు. దేశభక్తులను జైళ్లలోకి నెట్టేశారని అన్నారు. భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయమని పేర్కొన్నారు. వందేమాతర గీతం గొప్పతనాన్ని పునరుద్ధించుకునే గొప్ప అవకాశం ఇప్పుడు వచ్చిందని చెప్పారు. ఈ అవకాశాన్ని వదులుకోరాదని సూచించారు.
బ్రిటిష్ వారు 1905లో బెంగాల్‌ను విభజించినప్పుడు వందేమాతరం ఒక ఆయుధంలా బలంగా నిలబడి ఐక్యతా స్ఫూర్తిని రగిల్చిందని మోదీ చెప్పారు. విభజించి పాలించాలనే విధానాన్ని బ్రిటిషర్లు అవలంభించినప్పుడు బెంగాల్ మేథో శక్తి దేశానికి మార్గదర్శకం చేసిందని అన్నారు. దేశాన్ని ఏకతాటిపై నడిపించిన వందేమాతర గీతానికి పునర్వైభవం రావాలని, ఇవాల్టి చర్చలు భవిష్యత్ తరానికి స్ఫూర్తి కావాలని, 2047 వికసిత్ భారత్ నెరవేరాలంటే వందేమాతరం స్ఫూర్తి అవసరమని ప్రధాని ఉద్బోధించారు.
ఇవి కూడా చదవండి..
వందేమాతర గీతం దేశం ముక్కలు కాకుండా కాపాడింది.. లోక్‌సభలో మోదీ..
ఇండిగో అంతర్గత సమస్యల వల్లే ఈ సంక్షోభం: కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి