Vande Mataram 150 Years: వందేమాతర గీతం దేశం ముక్కలు కాకుండా కాపాడింది.. లోక్‌సభలో మోదీ..
ABN , Publish Date - Dec 08 , 2025 | 01:08 PM
లోక్‌సభలో వందేమాతరం 150 ఏళ్ల ఉత్సవాలపై సోమవారం చర్చ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ వందేమాతర గీతం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. వందేమాతరంపై చర్చలో పాల్గొన్నందుకు గర్వపడుతున్నానని అన్నారు.
న్యూఢిల్లీ: వందేమాతరం 150 ఏళ్ల ఉత్సవాలపై సోమవారం లోక్‌సభలో చర్చ జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ వందేమాతరంపై లోక్‌సభలో మాట్లాడారు. వందేమాతరంపై చర్చలో పాల్గొన్నందుకు గర్వపడుతున్నానని అన్నారు. జాతీయ గేయం 150 ఏళ్లు పూర్తిచేసుకుందని, స్వాతంత్ర్య పోరాటంలో భారతీయుల గొంతుక అయిన వందేమాతర గీతం ఎన్నో తరాలకు స్ఫూర్తినిచ్చిందని అన్నారు. వందేమాతరం ఉద్దేశాన్ని, గౌరవాన్ని మళ్లీ తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. 2047 వికసిత్ భారత్ నెరవేరాలంటే వందేమాతరం స్ఫూర్తి అవసరమన్నారు. బంకించంద్ర చటర్జీ రాసిన వందేమాతరం దేశానికి పునరుజ్జీవాన్నిచ్చిందని చెప్పారు.
గాడ్ సేవ్ ద క్వీన్ గీతానికి పోటీగా వందేమాతరం గర్వంగా నిలబడిందని అన్నారు. భారతమాతను దుర్గామాతగా కొలుస్తూ బంకించంద్ర అద్భుతంగా ఆ పాటను రాశారని తెలిపారు. వందేమాతరం.. ఆజాద్ భారత్‌కు విజన్‌గా మారిందని వెల్లడించారు. వందేమాతర గేయం శత్రువుల చెవుల్లో మారుమోగిందని అన్నారు. జననీ జన్మభూమిశ్చ అన్న రాముడి మాటలకు మరోరూపం వందేమాతరం అంటూ భావోద్వేగానికి గురయ్యారు. జ్ఞానం, సమృద్ధికి భారత్ మారుపేరని ప్రధాని మోదీ అన్నారు.
భారత్ ముక్కలు కాకుండా కాపాడింది
బ్రిటిష్ పరిపాలన కాలంనాటి పరిస్థితుల గురించి, అప్పటి ప్రజలపై వందేమాతర గీతం ప్రభావం గురించి మోదీ ప్రత్యేకంగా చెప్పారు. ఆయన మాట్లాడుతూ... ‘దేశాన్ని ముక్కలు చేయాలని బ్రిటిషర్లు ప్రయత్నించారు. భారత్ ముక్కలు కాకుండా వందేమాతర నినాదం సాయం చేసింది. బెంగాల్ ఐక్యతకు వందేమాతర గేయం పాత్ర ఎనలేనిది. వందేమాతర నినాదం పలకకూడదని నిషేధం విధించారు. నిషేధం, ఆజ్ఞలు పట్టించుకోకుండా ప్రజలు పోరాటం చేశారు. వందేమాతర నినాదాలు వినలేక బ్రిటిషర్లు దారుణాలకు పాల్పడ్డారు. దేశంలో అనేక చోట్ల ఉద్యమకారులను కఠినంగా అణచివేశారు’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
పాదాలను గోరువెచ్చని ఉప్పు నీటిలో ఉంచితే ఈ వ్యాధులు నయం.!
సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన షెడ్యూల్ ఖరారు.. పూర్తి వివరాలివే..