Air India: టికెట్ల ధరలపై పరిమితి విధిస్తున్నాం: ఎయిర్ ఇండియా
ABN , Publish Date - Dec 08 , 2025 | 08:30 AM
ఇండిగో కార్యకలాపాల సంక్షోభంతో పెరిగిన విమాన టికెట్ ధరలను నియంత్రించేందుకు ఎయిర్ ఇండియా స్వచ్ఛందంగా ఎకానమీ టికెట్లపై ధర పరిమితి విధించింది. విమానయాన శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు చేపట్టింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ విమాయయాన సంస్థ ఇండిగోలో తలెత్తిన కార్యాచరణ సంక్షోభం కారణంగా దేశీయ విమాన ప్రయాణ ఛార్జీలపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులపై భారం పడకుండా చూసేందుకు ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇండిగో సమస్యల వల్ల డిమాండ్-సప్లై మధ్య ఏర్పడిన అంతరాన్ని ఆసరాగా చేసుకుని టికెట్ ధరలు విపరీతంగా పెరగడంతో ఎయిరిండియా(Air India) స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది.
పౌర విమానయాన శాఖ మార్గదర్శకాల ప్రకారం టికెట్ల ధరలపై పరిమితి విధించనున్నట్లు ‘ఎక్స్’ వేదికగా ఎయిర్ ఇండియా ప్రకటించింది. దీంతో ఎకానమీ క్లాస్ టికెట్ల ధరలపై పరిమితి విధించనున్నారు. దీన్ని మరికొన్ని గంటల్లోనే అమల్లోకి తీసుకురానున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం దృష్ట్యా డిసెంబర్ 6న విమాన టికెట్ల ధరలను పౌర విమానయాన శాఖ క్రమబద్ధీకరించింది. ఈ మేరకు ఆయా ఎయిర్‌లైన్స్‌కు మార్గదర్శకాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా ఎయిర్ ఇండియా తాజాగా చర్యలు చేపట్టింది.
మరోవైపు ఇండిగో(ndiGo) విమానయాన పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతోంది. ఆదివారం ఆ సంస్థ 1650 సర్వీసులు నడిపింది. రద్దయిన వాటి సంఖ్య శనివారం (800)తో పోలిస్తే ఆదివారం 650కి తగ్గింది. నెమ్మదిగా గాడిన పడుతున్నామని సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) పీటర్ ఎల్బెర్స్ తెలిపారు. ఆరు మెట్రో నగరాలతో పాటు ఇతర ప్రాంతాల్లో సమయ పాలనా రేటు కూడా మెరుగుపడుతోందని ఇండిగో వర్గాలు తెలిపాయి. రద్దైన, తీవ్రంగా ఆలస్యమైన విమానాలకు సంబంధించి ఇప్పటివరకు రిఫండ్ల రూపంలో ఇండిగో.. రూ.610 కోట్లు విడుదల చేసిందని ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది. మూడు వేల బ్యాగేజీలను కూడా ప్రయాణికులకు అప్పగించిందని తెలిపింది. మిగతా దేశీయ విమానయాన సంస్థలన్నీ తమ కార్యకలాపాలను సాఫీగా నిర్వహిస్తున్నాయని, ఇండిగో పరిస్థితి కూడా మెరుగవుతోందని చెప్పింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సిరీస్ మొత్తంలో గర్వపడింది అప్పుడే: కేఎల్ రాహుల్
రికార్డులకే ‘కింగ్’.. సచిన్ మరో రికార్డు బద్దలు!