KL Rahul: సిరీస్ మొత్తంలో గర్వపడింది అప్పుడే: కేఎల్ రాహుల్
ABN , Publish Date - Dec 07 , 2025 | 11:02 AM
సౌతాఫ్రికాపై టీమిండియా 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం భారత వన్డే కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడాడు. సిరీస్ మొత్తంలో టాస్ గెలిచినప్పుడే ఎంతో ఆనందంగా ఫీలయ్యానని తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా-సౌతాఫ్రికా జట్ల మధ్య వైజాగ్ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్ సునాయాసంగా విజయం సాధించింది. దీంతో 2-1తేడాతో భారత్.. సిరీస్‌ను దక్కించుకుంది. మ్యాచ్ అనంతరం టీమిండియా వన్డే కెప్టెన్ కేఎల్ రాహుల్(KL Rahul) మాట్లాడాడు.
‘ఆటలో టాస్ గెలవడం చాలా కీలకం. మూడో వన్డేలో టాస్ వేసి గెలవడం తప్ప నా పాత్రమే లేదు. కానీ ఈ సిరీస్ మొత్తంలో ఏదీ ఇవ్వని ఆనందాన్ని టాస్ గెలుపు ఇచ్చింది. ఈ మూడు వన్డేల్లో నేను గర్వపడిన సందర్భం అదే. తొలి రెండు వన్డేల్లో టాస్ ఓడటం వల్ల సెకండ్ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయాల్సి వచ్చింది. డ్యూ వచ్చే సమయాల్లో బౌలర్లకు సెకండ్ ఇన్నింగ్స్ ఆడటం సవాలుతో కూడుకున్న పని. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మా బౌలర్లు ఇబ్బందులకు గురి కాకుండా కాపాడాను. పిచ్ బ్యాటింగ్‌కు చాలా అనుకూలంగా ఉంది. అయినా మా బౌలర్లు అద్భుతంగా బంతులు సంధించారు. సఫారీ బ్యాటర్లలో డికాక్ సూపర్ నాక్ ఆడాడు. సిరీస్ గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. సిరీస్ ఆద్యాంతం సౌతాఫ్రికా బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. రెండో వన్డేలో అదృష్టం మాతో లేదు. అందుకే ఓడాం’ అని కేఎల్ రాహుల్ వివరించాడు.
ఎట్టకేలకు..
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్(19 నవంబర్) నుంచి టీమిండియా ఒక్క టాస్ కూడా గెలవలేకపోయింది. వన్డేల్లో ఏకంగా 20 సార్లు టాస్ ఓడి ఓ చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఫార్మాట్లు మారాయి.. వేదికలు మారాయ్.. కెప్టెన్లు కూడా మారారు.. అయినా టాస్ రాత మాత్రం మారలేదు. ఎట్టకేలకు ఆ చెత్త రికార్డుకు తెరదింపుతూ సౌతాఫ్రికాతో మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచింది. కేఎల్ రాహుల్ ఎడమ చేతితో నాణెన్ని విసిరి టాస్ గెలిచాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
రికార్డులకే ‘కింగ్’.. సచిన్ మరో రికార్డు బద్దలు!
మీ హద్దుల్లో మీరుంటే మంచిది.. గంభీర్ అసహనం