Gautam Gambhir: మీ హద్దుల్లో మీరుంటే మంచిది.. గంభీర్ అసహనం
ABN , Publish Date - Dec 07 , 2025 | 09:10 AM
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో టీమిండియా సొంతగడ్డపై వైట్ వాష్ అయిన విషయం తెలిసిందే. అప్పుడు ఐపీఎల్ ఢిల్లీ క్యాపిట్సల్ సహ యజమాని.. కోచింగ్ సిబ్బందిపై విమర్శలు చేస్తూ పోస్ట్ పెట్టాడు. దానికి గంభీర్ ఇప్పుడు ఘాటుగా స్పందిస్తూ కౌంటర్ ఇచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: సొంతగడ్డపై సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో టీమిండియా వైట్ వాష్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్న ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కు సిరీస్ విజయంతో భారీ ఊరట లభించింది. టెస్టు సిరీస్ ఓటమి తర్వాత గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అతడిని ఆ పదవి నుంచి తొలగించాలంటూ డిమాండ్లూ వినిపించాయి. తొలి టెస్టులో విజయం సాధించే అవకాశం గంభీర్ వల్లే చేజారిందన్నవారూ ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రశ్నలన్నింటికీ గౌతీ(Gautam Gambhir) సమాధానమిచ్చారు.
‘టెస్టు సిరీస్ ఓటమి తర్వాత ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. కానీ ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది అనే అంశంపై ఎవరూ మాట్లాకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఫలితాలు అనుకూలంగా రానప్పుడు బయట చర్చ జరగడం సహజమే. కానీ ఏ మీడియాలోనూ తొలి టెస్టులో ఎలా ఓడిపోయామనే విషయాన్ని రాయలేదు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా రెండు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఆ మ్యాచ్‌లో అదే వ్యత్యాసం కనిపించింది. కానీ ప్రెస్ కాన్ఫరెన్స్‌ల్లో ఓటమికి సాకులు చెప్పడం నాకు రాదు. అలాగని మీరు(విమర్శకులను ఉద్దేశించి) నిజాలను ప్రపంచానికి తెలియజేయవద్దని నేను అనను’ అని గంభీర్ తెలిపాడు.
మాటలు జాగ్రత్త..
‘జట్టు మార్పు దశలో ఉన్నప్పుడు, సారథఏ మ్యాచ్‌కు అందుబాటులో లేనప్పుడు ఇలాంటివన్నీ ఎదురవుతాయి. గిల్ అప్పటికే అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కానీ అతడి సేవలు జట్టుకు అందుబాటులో లేకుండా పోయాయి. ఈ విషయం గురించి ఎవ్వరూ ప్రస్తావించలేదు. క్రికెట్ అంటే ఏంటో తెలియని వాళ్లు కూడా పిచ్‌పై విమర్శలు చేశారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ ఒకరు ఏకంగా కోచింగ్ వ్యవస్థనే విభజించాలని మాట్లాడారు. ఎవరైనా సరే తమ హద్దుల్లో తాము ఉంటే మంచిది. విమర్శించేటప్పుడు మాటలు అదుపులో పెట్టుకోవాలి’ అని గంభీర్ ఘాటుగా స్పందించాడు. రెండో టెస్టులో భారత్ ఓటమి అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ కోచింగ్ సిబ్బందిపై విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. దానికి ఇప్పుడు గంభీర్ కౌంటర్ ఇవ్వడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి..
అదే మా ఓటమికి కారణమైంది: టెంబా బవుమా
మూడేళ్ల తర్వాత విరాట్ 3.0ని చూశారు.. కింగ్ కోహ్లీ