Share News

Virat Kohli: మూడేళ్ల తర్వాత విరాట్ 3.0ని చూశారు.. కింగ్ కోహ్లీ

ABN , Publish Date - Dec 07 , 2025 | 07:42 AM

సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో సొంతం చేసుకుంది. విజయానంతరం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాట్లాడాడు. గత రెండు-మూడేళ్లుగా తాను ఇలా ఆడలేదని.. విరాట్ 3.0ని చూశారని అన్నాడు.

Virat Kohli: మూడేళ్ల తర్వాత విరాట్ 3.0ని చూశారు.. కింగ్ కోహ్లీ
Virat Kohli

ఇంటర్నెట్ డెస్క్: సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో దక్కించుకున్న విషయం తెలిసిందే. వైజాగ్ వేదికగా జరిగిన మూడో వన్డేలో సఫారీలు నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఈ టోర్నీలో అసాధారణ బ్యాటింగ్ కనబర్చిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. తొలి రెండు వన్డేల్లో సెంచరీలు, మూడో వన్డేలో హాఫ్ సెంచరీతో 302 పరుగులు చేసిన కోహ్లీ టాప్ స్కోరర్‌గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేనా.. ఈ సిరీస్‌లో అత్యధిక సిక్సులు బాదింది కూడా విరాటే. మూడు మ్యాచుల్లో వందకు పైగా స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 12 సిక్సులు కొట్టేశాడు. విజయానంతరం కోహ్లీ మాట్లాడాడు.


‘ఈ సిరీస్‌లో నేను ఆడిన తీరు సంతృప్తినిచ్చింది. ప్రస్తుతం నా మనసు చాలా తేలికగా అనిపిస్తుంది. గత రెండు-మూడేళ్లుగా నేను ఇలా ఆడలేదు. నేను ఇలా ఆడితే జట్టుకు బాగా ఉపయోగపడుతుందని నాకు తెలుసు. ఈ ప్రదర్శన నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ప్రతికూల పరిస్థితుల్లోనైనా నేను రాణించగలనే నమ్మకం నాకుంది. జట్టుకు గెలుపు బాట వేయగలను. నా సొంత ప్రమాణాలను కొనసాగిస్తూనే జట్టు విజయాల్లో భాగమయ్యేందుకు ప్రయత్నించాను. పరిస్థితులకు అనుగుణంగా నేను ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయగలిగాను’ అని విరాట్ వివరించాడు.


అగ్రెషన్ అవసరం..

16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో.. ఎన్నో అనుభవాలు ఉంటాయి. ఎంత ధీటుగా ఆడుతున్నప్పటికీ కొన్ని భయాలు వెంటాడుతాయి. ముఖ్యంగా బ్యాటింగ్‌లో చిన్న పొరపాటు తీవ్ర నష్టానికి దారి తీయొచ్చు. ఇది ఒక ప్రయాణం.. మంచి వ్యక్తిగా మారేందుకు ఓ అవకాశం. మనిషికి అగ్రెషన్ కూడా అవసరమే. ఇప్పటికీ జట్టు విజయాల్లో నేనూ భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపాడు.


రాంచీ ఇన్నింగ్స్ బెస్ట్..

‘ఈ సిరీస్‌లో నా తొలి ఇన్నింగ్స్ అత్యుత్తమైంది. ఆస్ట్రేలియాతో సిరీస్ తర్వాత క్రికెట్ ఆడలేదు. ఆరోజు ఉన్న ఉత్సాహమే రిస్క్ తీసుకునేలా చేసింది. కచ్చితంగా గెలిచి తీరాలనే ఆశే.. నాలో ఉన్న అత్యుత్తమ ఆటగాడిని బయటకి తీస్తుంది. రోహిత్ కూడా జట్టు తరఫున సుదీర్ఘ కాలంగా ఆడుతున్నాడు. ఇప్పటకీ మా నుంచి మంచి ప్రదర్శనలు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. జట్టు కోసం ఇంకా ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకుంటున్నాం’ అని కోహ్లీ వెల్లడించాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

సౌతాఫ్రికా ఆలౌట్.. భారత్ టార్గెట్ 271

రికార్డు సృష్టించిన క్వింటన్ డికాక్

Updated Date - Dec 07 , 2025 | 07:42 AM