Virat Kohli: రికార్డులకే ‘కింగ్’.. సచిన్ మరో రికార్డు బద్దలు!
ABN , Publish Date - Dec 07 , 2025 | 10:03 AM
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సౌతాఫ్రికాతో వన్డేల్లో అద్భుత ప్రదర్శన కనబర్చి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: పరుగుల వీరుడు.. రికార్డుల ధీరుడు.. కింగ్ విరాట్ కోహ్లీ. కోహ్లీ బ్యాట్ పట్టాడంటే.. ప్రత్యర్థి బౌలర్లు చిత్తు కావాల్సిందే. క్రీజులో పాతుకుపోయాడంటే రికార్డులు తలొంచాల్సిందే! రికార్డులకే ‘కింగ్’.. కోహ్లీ(Virat Kohli) మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. సౌతాఫ్రికా వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శనకు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సార్లు ఈ అవార్డు పొందిన ఆటగాడిగా అవతరించాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టాడు.
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో(135), రెండో మ్యాచ్(102), మూడో వన్డేలో(65*) మొత్తంగా ఈ సిరీస్‌లో 302 పరుగులు చేసిన కోహ్లకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. సచిన్ ఖాతాలో ఇప్పటి వరకు 19 ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు ఉండగా.. విరాట్ సౌతాఫ్రికాతో వన్డేలో 20వ అవార్డు అందుకున్నాడు. దీంతో సచిన్‌ను వెనక్కి నెట్టి ఈ అవార్డు అందుకున్న ఆటగాళ్లలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్, సచిన్ తర్వాతి స్థానాల్లో షకీబ్ అల్ హసన్(17), జాక్ కల్లిస్(14), సనత్ జయసూర్య(13), డేవిడ్ వార్నర్(13) ఉన్నారు.
వన్డేల్లో..
వన్డేల్లో విరాట్‌కి ఇది 11వ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’. ఈ జాబితాలో సనత్ జయసూర్య రికార్డును కోహ్లీ సమం చేసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. జయసూర్య ఖాతాలోనూ 11 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఉన్నాయి. వన్డేల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలిచిన ఆటగాడిగా సచిన్ చలామణి అవుతున్నాడు. ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విరాట్.. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
అదే మా ఓటమికి కారణమైంది: టెంబా బవుమా
మూడేళ్ల తర్వాత విరాట్ 3.0ని చూశారు.. కింగ్ కోహ్లీ