Share News

Vande Mataraam Debate: చర్చ ఏదైనా నెహ్రూ పేరు ప్రస్తావిస్తూనే ఉన్నారు... మోదీకి గౌరవ్ గొగోయ్ కౌంటర్

ABN , Publish Date - Dec 08 , 2025 | 04:22 PM

ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారని, వాటి గురించి ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడరని, ఢిల్లీ పేలుళ్ల ప్రస్తావనే లేదని, ఢిల్లీ అయినా పహల్గాం అయినా ప్రజలను రక్షించే పరిస్థితిలో మనం లేమని గౌరవ్ గొగోయ్ విమర్శించారు.

Vande Mataraam Debate: చర్చ ఏదైనా నెహ్రూ పేరు ప్రస్తావిస్తూనే ఉన్నారు... మోదీకి గౌరవ్ గొగోయ్ కౌంటర్
Gaurav Gogoi

న్యూఢిల్లీ: వందేమాతరం గీతానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చి జాతీయగీతం చేసిందని లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్ (Gaurav Gogoi) అన్నారు. వందేమాతర గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారంనాడు లోక్‌సభలో జరిగిన ప్రత్యేక చర్చలో ఆయన పాల్గొన్నారు. పండిట్ నెహ్రూపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విమర్శలకు స్పందిస్తూ.. చర్చ ఏదైనా నెహ్రూ పేరు వాడకుండా మోదీ ప్రసంగం ఉండటం లేదన్నారు.


'వందేమాతరం గీతానికి కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. ఎంతో ప్రాధాన్యతనిచ్చి జాతీయగీతం చేసింది. ప్రధాని ప్రతి డిబేట్‌లోనూ నెహ్రూ పేరు, కాంగ్రెస్ పేరు వాడుకుంటారు. ఆపరేషన్ సింధూర్‌పై చర్చలో పండిట్ నెహ్రూ పేరును 14 సార్లు, కాంగ్రెస్ పేరు 50 సార్లు వాడారు. 75వ రాజ్యాంగ దినోత్సవంలో నెహ్రూ పేరు 15 సార్లు, కాంగ్రెస్ పేరు 26 సార్లు వాడారు. 2022లో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చలో నెహ్రూ పేరు 20 సార్లు ఉపయోగించారు. మోదీకి, ఆయన టీమ్‌కు నేను ఒకటి చెప్పదలచుకున్నాను. మీరెంత కష్టపడినా సరే పండిట్ నెహ్రూజీ దేశానికి అందించిన సేవలపై ఎలాంటి మరక అంటదు' అని గౌరవ్ గొగోయ్ అన్నారు.


ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారని, వాటి గురించి ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడరని, ఢిల్లీ పేలుళ్ల ప్రస్తావనే లేదని, ఢిల్లీ అయినా పహల్గాం అయినా ప్రజలను రక్షించే పరిస్థితిలో మనం లేమని గొగోయ్ విమర్శించారు. దేశవ్యాప్తంగా విమానాల రద్దుతో రోజుల తరబడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, దీనిపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ సభ ద్వారా ప్రజలకు పరిస్థితిని వివరించాలని కోరారు. ప్రయాణికుల్లో అనేక మంది డయాలసిస్ పేషెంట్లు ఉన్నారని, కొందరి ఇళ్లల్లో పెళ్లిళ్లు ఉన్నాయని, వృద్ధులైన బంధువులను చూసేందుకు వెళ్తున్న వారున్నారని, జనం డబ్బులు నష్టపోతున్నారని, విమానాశ్రయాల్లో ఎక్కడ చూసిన ఈ అలజడే కనిపిస్తోందని అన్నారు.


దీనికి ముందు, వందేమాతరం గీతంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్, నెహ్రూపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. జాతీయ గీతం విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజీపడితే, మాజీ ప్రధాని నెహ్రూ వందేమాతర గీతంలోని కొన్ని భాగాలు ముస్లింలకు నచ్చకపోవచ్చంటూ సుభాష్ చంద్రబోస్‌కు లేఖ రాశారని చెప్పారు. వందేమాత గీతాన్ని సమీక్షించాలని కోరారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలీగ్‌కు దాసోహం అనడం, వందేమాతర గీతాన్ని ముక్కలు చేయాలని నిర్ణయించడం దురదృష్టకరమని విమర్శించారు.


ఇవి కూడా చదవండి..

జిన్నా వ్యతిరేకిస్తే నెహ్రూ సమర్ధించారు.. వందేమాతరంపై చర్చలో మోదీ

వందేమాతర గీతం దేశం ముక్కలు కాకుండా కాపాడింది.. లోక్‌సభలో మోదీ..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 08 , 2025 | 04:52 PM