Share News

PM Modi: శాంతిపక్షానే భారత్.. పుతిన్‌కు మోదీ స్పష్టీకరణ

ABN , Publish Date - Dec 05 , 2025 | 03:26 PM

ఉక్రెయిన్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి పుతిన్ ప్రభుత్వం భారత్‌పై విశ్వాసం ఉంచి ప్రతి విషయాన్ని తమతో పంచుకుందని మోదీ అన్నారు. ఇరుదేశాల మధ్య నమ్మకం అనేది గొప్ప బలమని, ఇదే విషయాన్ని తాము పదేపదే చెబుతూ వచ్చామని, ప్రపంచానికి కూడా తెలియజేశామని అన్నారు.

PM Modi: శాంతిపక్షానే భారత్.. పుతిన్‌కు మోదీ స్పష్టీకరణ
PM Modi with Putin

న్యూఢిల్లీ: శాంతిపక్షానే భారత్ నిలుస్తుందని, ఉక్రెయిన్ సంక్షోభాన్ని శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు సహకరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Putin)తో శుక్రవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ, దేశాల సంక్షేమం శాంతి మార్గంలోనే ఉందని, దౌత్యం ద్వారానే రష్యా, ఉక్రెయిన్‌లు విభేదాలను పరిష్కరించుకుంటారనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. భారత్, రష్యా కలిసి ప్రపంచాన్ని శాంతి మార్గంలో నడిపిద్దామని పుతిన్‌తో అన్నారు.


ఉక్రెయిన్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి పుతిన్ ప్రభుత్వం భారత్‌పై విశ్వాసం ఉంచి ప్రతి విషయాన్ని తమతో పంచుకుందని మోదీ అన్నారు. ఇరుదేశాల మధ్య నమ్మకం అనేది గొప్ప బలమని, ఇదే విషయాన్ని తాము పదేపదే చెబుతూ వచ్చామని, ప్రపంచానికి కూడా తెలియజేశామని అన్నారు. ఇటీవల కాలంలో గ్లోబల్ నేతలతో తాను ఎప్పుడు మాట్లాడినా ఇండియా తటస్థం కాదనీ, ఇండియాకు స్పష్టమైన వైఖరి ఉందని, శాంతియుతంగా జరిగే ఏ పరిష్కారానికైనా తమ సపోర్ట్ ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పామని మోదీ తెలిపారు.

ఇంధన భద్రత కీలకం

భారత్-రష్యా మధ్య భాగస్వామ్యానికి ఇంధన భద్రత అనేది బలమైన స్తంభం వంటిందని, పరస్పర లాభదాయక సహకారాన్ని తాము కొనసాగిస్తామని మోదీ చెప్పారు. సివిల్ న్యూక్లియర్ ఎనర్జీలో తమ భాగస్వామ్యం దశాబ్దాల నాటిదని, క్రిటికల్ మినిరల్స్ అంశంలోనూ పరస్పర సహకారం తప్పనిసరని అన్నారు. ఆర్థిక సహకారం పెంపునకు విజన్ 2023 డాక్యుమెంట్‌పై ఉభయదేశాలు సంతకం చేసినట్టు చెప్పారు. ఇండియా-రష్యా బిజినెస్ ఫోరంలోనూ ఈరోజు తామిరువురూ పాల్గొంటామని, ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసేందుకు ఇది వేదిక అవుతుందని తాము బలంగా నమ్ముతున్నామని చెప్పారు. కాగా, ఉక్రెయిన్‌తో శాంతియుత పరిష్కారానికి తాము పని చేస్తున్నట్టు పుతిన్ కూడా ప్రధాని మోదీకి తెలిపారు.


కాగా, దీనికి ముందు పుతిన్‌కు రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. తన పర్యటనలో భాగంగా రాజ్‌ఘాట్‌లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పుతిన్ నివాళులర్పించారు. మోడ్రన్ ఇండియా వ్యవస్థాపకుల్లో ఒకరిగా, గొప్ప ఫిలాసఫర్‌గా, మానవతావాదిగా మహాత్మాగాంధీ నిలిచారని, ప్రపంచ శాంతికి ఎనలేని కృషి చేశారని పుతిన్ అక్కడి విజిటర్స్ బుక్‌లో రాశారు. స్వేచ్ఛ, మంచితనం, మానవత్వంపై మహాత్మాగాంధీ ఆలోచన నేటికీ నిత్య నూతనమని గుర్తుచేసుకున్నారు.


ఇవి కూడా చదవండి..

అమెరికాకు బిగ్ షాక్.. ఆ విషయంలో భారత్‌కు అండగా రష్యా..

వందల కొద్దీ విమానాల రద్దు.. ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో ప్రయాణికుల ఇక్కట్లు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 05 , 2025 | 03:47 PM