IndiGo Flight Disruptions: వందల కొద్దీ విమానాల రద్దు.. ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో ప్రయాణికుల ఇక్కట్లు
ABN , Publish Date - Dec 05 , 2025 | 11:18 AM
ఇండిగో విమాన సర్వీసులు పెద్ద ఎత్తున క్యాన్సిల్ కావడంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో నానా అవస్థలు పడ్డారు. అసలు ఏం జరుగుతోందో తెలియక, సరైన సమాధానం చెప్పే వారు లేక టార్చర్ అనుభవించామని పలువురు వాపోయారు.
ఇంటర్నెట్ డెస్క్: ఒకే రోజు 500 పైచిలుకు విమానాలు క్యాన్సిల్ కావడంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణికులు గురువారం నానా ఇక్కట్ల పాలయ్యారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన వెళ్లబోసుకున్నారు. తమకు నరకం కనిపించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ లగేజీని వెనక్కు తెచ్చుకోలేక, కనీసం తిండి, తాగడానికి నీరూ లేక ఇక్కట్ల పాలయ్యామని పలువురు వాపోయారు. దీంతో, దేశంలోని వివిధ ఎయిర్‌పోర్టుల్లో షాకింగ్ దృశ్యాలు కనిపించాయి (IndiGo Flight Disruptions-Chaos At Airports).
జాతీయ మీడియా కథనాల ప్రకారం, అకస్మాత్తుగా ప్రయాణాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకుపోయారు. కొందరు నేలపై పడుకుని నిద్రించారు. కౌంటర్‌లల్లో ఇండిగో సిబ్బంది కానరాక, ఎవరిని ప్రశ్నించాలో తెలియక ఇబ్బందుల పాలయ్యారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు టర్మినల్‌లో వేల కొద్దీ సూట్‌కేసులు పోగుబడి కనిపించాయి. కొందరు ప్రయాణికులు నిరసనకు దిగారు. సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇది తమకు నిజంగా మెంటల్ టార్చర్ అని ఓ ప్రయాణికుడు వాపోయాడు. 12 గంటలుగా ఎయిర్‌పోర్టులోనే ఉన్నా తనకు సంస్థ నుంచి ఎలాంటి వివరణ అందలేదని అన్నాడు. అడిగిన ప్రతిసారీ మరో గంట లేటవుతుందని సిబ్బంది చెప్పారని వాపోయారు. మరికొందరేమో తాము ఏకంగా 14 గంటల నుంచీ వెయిట్ చేస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీతో పాటు దేశంలోని ఇతర ఎయిర్‌పోర్టుల్లో దాదాపు ఇవే దృశ్యాలు కనిపించాయి.
సిబ్బంది కొరతతో సతమతమవుతున్న ఇండిగో సంస్థ నేడు కూడా ఫ్లైట్ సర్వీసుల రద్దు కొనసాగుతుందని తెలిపింది. పైలట్ల షెడ్యూల్‌కు సంబంధించి కొత్త నిబంధనల విషయంలో పొరపాటు పడ్డామని, ఫలితంగా సిబ్బంది కొరత తీవ్రంగా మారిందని డీజీసీఏకు వివరణ ఇచ్చింది. నిబంధనల నుంచి తాత్కాలిక మినహాయింపును ఇవ్వాలని కూడా కోరింది. డిసెంబర్ 8 నుంచి పరిస్థితులు అదుపులోకి వస్తాయని తెలిపింది. పరిస్థితి చక్కదిద్దేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్నామని వివరించింది.
విమాన పైలట్లకు అధిక విశ్రాంతిని ఇచ్చేందుకు ఉద్దేశించిన కొత్త నిబంధనలు ఇటీవలే పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనల మేరకు డ్యూటీ కేటాయింపు కోసం అవసరమైన సంఖ్యలో పైలట్‌లు లేకపోవడం, శీతాకాలంలో అవాంతరాలు మరింత పెరగడంతో ఇండిగో పలు ఫ్లైట్ సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది.
ఇవి కూడా చదవండి:
బెంగాల్‌లో బాబ్రీ మసీదు నిర్మిస్తామన్న తృణమూల్ ఎమ్మెల్యేపై వేటు
నావికాదళ దినోత్సవం.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి