PM Navy Day Greetings: నావికాదళ దినోత్సవం.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
ABN , Publish Date - Dec 04 , 2025 | 12:25 PM
నేవీ డేను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ నావికాదళ సిబ్బందికి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పట్టుదల, పరాక్రమానికి నేవీ పర్యాయపదమని ప్రశంసించారు.
ఇంటర్నెట్ డెస్క్: నావికాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శుభాకాంక్షలు తెలిపారు. పట్టుదల, ధీరత్వానికి భారత నేవి పర్యాయపదమని ప్రశంసించారు. ‘నేవీ డే సందర్భంగా భారత నావికాదళ సిబ్బంది అందరికీ శుభాకాంక్షలు. అసమాన ధైర్యసాహనాలు, పట్టుదలకు మన నేవీ పర్యాయపదం. దేశ ప్రయోజనాలకు, తీర ప్రాంతానికి నేవీ రక్షణగా నిలుస్తోంది. ఇటీవల కాలంలో స్వావలంబన, అధునికీకరణపై నేవీ దృష్టి సారించింది’ అని మోదీ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. నేవీ తీసుకుంటున్న చర్యల కారణంగా దేశ భద్రత మరింత పటిష్ఠమైందని అన్నారు (PM Navy Day Greetings).
ఈ సందర్భంగా దీపావళిని తాను ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకపై జరుపుకున్న విషయాన్ని కూడా ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. ఆ క్షణాలను ఎన్నటికీ మర్చిపోలేనని అన్నారు. నేవీకి సదా విజయం లభించాలని ఆకాంక్షించారు. ఇక దీపావళి వేడుక సందర్భంగా ఐఎన్ఎస్ విక్రాంత్ వేదికగా మోదీ ప్రసంగిస్తూ సాయుధ దళాలు తన కుటుంబమని అన్నారు. గత 11 ఏళ్లుగా తాను దీపావళిని సాయుధ దళాల మధ్య జరుపుకోవడం ఆనవాయితీగా మారిందని చెప్పారు.
ఇదిలా ఉంటే, బుధవారం తిరువనంతపురంలో జరిగిన నావికాదళ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా పాల్గొన్నారు. శంకుముఖం బీచ్‌లో నావికాదళాధిపతి అడ్మిరల్ దినేశ్ కే త్రిపాఠీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో నౌకాదళ పాటవం, పరాక్రమాన్ని చాటిచెప్పే విన్యాసాలను రాష్ట్రపతి వీక్షించారు. ఈ కార్యక్రమంలో కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్, రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మిలిటరీకి చెందిన పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
1971లో పాక్‌తో యుద్ధ సమయంలో భారత నావికాదళ వీరోచిత పోరాటం భారత్ విజయానికి బాటలు పరిచింది. ఆ ఏడాది డిసెంబర్ 4న ఆపరేషన్ ట్రైడెంట్ పేరిట నావికాదళం కరాచీ పోర్టుపై విరుచుకుపడి దయాదిని కోలుకోలేని దెబ్బకొట్టింది. ఈ ఆపరేషన్ విజయాన్ని పురస్కరించుకుని భారత్ ఏటా ఇదే రోజున నావికాదళ దినోత్సవాన్ని జరుపుకుంటోంది.
ఇవి కూడా చదవండి:
ఇండిగో విమాన సర్వీసుల రద్దు.. దేశవ్యాప్తంగా కలకలం.. అసలేం జరుగుతోందంటే..
ట్రంప్ ఎఫెక్ట్.. భారీగా ఆదాయాన్ని కోల్పోనున్న అమెరికా యూనివర్సిటీలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి