IndiGo Flight Disruptions: ఇండిగో విమాన సర్వీసుల రద్దు.. దేశవ్యాప్తంగా కలకలం.. అసలేం జరుగుతోందంటే..
ABN , Publish Date - Dec 04 , 2025 | 11:00 AM
సిబ్బంది కొరత తలెత్తడంతో ఇండిగో ఫ్లైట్ సర్వీసుల్లో తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. ఫ్లైట్ డ్యూటీకి సంబంధించిన కొత్త నిబంధనలు సిబ్బంది కొరతకు దారి తీసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కస్టమర్లకు ఇండిగో క్షమాపణలు చెప్పింది. త్వరలో పరిస్థితులు సర్దుకుంటాయని వెల్లడించింది.
ఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడం కలకలానికి దారితీసింది. సిబ్బంది కొరత కారణంగా నేడు కూడా ఫ్లైట్ సర్వీసుకు ఆటంకాలు ఏర్పడ్డాయి (IndiGo Flight Disruptions).
ఢిల్లీ, ముంబై, హైదరబాద్ సహా పలు ఎయిర్‌పోర్టుల్లో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో గురువారం 30 ఫ్లైట్లు, హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో మరో 33 సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. ఈ రోజు సుమారు 170 ఫ్లైట్ సర్వీసులు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
సేవల్లో తీవ్ర ఆటంకాలు ఏర్పడిన విషయాన్ని అంగీకరించిన ఇండిగో కస్టమర్లకు క్షమాపణలు తెలిపింది. కార్యకలాపాలకు సంబంధించి అనుకోని ఇబ్బందులు, సాంకేతిక సమస్యలు, చలికాలంలో షెడ్యూలింగ్ మార్పులు, ప్రతికూల వాతావరణం, ఏవియేషన్ వ్యవస్థలో రద్దీ, పైలట్‌ల డ్యూటీలకు సంబంధించి కొత్త నిబంధనల వంటివి సమస్యను మరింత పెంచాయని పేర్కొంది. పరిస్థితులను చక్కదిద్దేందుకు షెడ్యూల్‌లో మార్పులు చేశామని తెలిపింది. మరో 48 గంటల్లో అంతా చక్కదిద్దుకుంటుందని భరోసా ఇచ్చింది.
ప్రస్తుతం ఇండిగో రోజూ దాదాపు 2200 ఫ్లైట్ సర్వీసులు నిర్వహిస్తోంది. 90 దేశీయ, 40 విదేశీ గమ్యస్థానాలకు ఫ్లైట్ సర్వీసులను నిర్వహిస్తోంది. అయితే, సిబ్బంది కొరత కారణంగానే ఈ పరిస్థితి తలెత్తినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. సవరించిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ (FDTL) నిబంధనల కారణంగా సిబ్బందికి కొరత ఏర్పడినట్టు తెలుస్తోంది. పైలట్‌లకు డ్యూటీ భారం తగ్గించి మరింత విశ్రాంతిని ఇచ్చేలా డ్యూటీ షెడ్యూల్ కోసం ఈ నిబంధనలను రూపొందించారు.
ఇక ఇండిగో సేవల్లో ఆటంకాల నేపథ్యంలో డీజీసీఏ గురువారం అత్యవసర సమావేశం నిర్వహించింది. అంతకుముందే ఈ అంశంపై విచారణ కూడా ప్రారంభించింది. ప్రస్తుత పరిస్థితికి కారణాలను, పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై ఓ నివేదిక ఇవ్వాలని ఇండిగోను ఆదేశించింది.
డీజీసీఏకు ఇండిగో గతంలో ఇచ్చిన సమాచారం ప్రకారం, నవంబర్‌లో మొత్తం 1232 ఫ్లైట్ సర్వీసులు రద్దయ్యాయి. వీటిలో ఫ్లైట్ డ్యూటీ టైమ్ పరిమితుల వల్ల 755, ఎయిర్‌పోర్టులో ఆంక్షల కారణంగా 258 రద్దయ్యాయి. ఏటీసీ వ్యవస్థ వైఫల్యం కారణంగా 92, ఇతరత్రా కారణాల వల్ల 127 విమానాలు రద్దయ్యాయి. సమయపాలనకు సంబంధించి ఎయిర్‌లైన్స్ పనితీరు అక్టోబర్‌లో 84.1 శాతం నుంచి నవంబర్‌లో 67.7 శాతానికి చేరుకుంది.
కొత్త ఎఫ్‌డీటీఎల్ నిబంధనల ప్రకారం, పైలట్‌లకు వారంలో 48 గంటల పాటు విశ్రాంతిని ఇవ్వాలి. గతంలో రాత్రి పూట ఆరు ల్యాండింగ్స్‌కు అనుమతి ఉండగా ప్రస్తుతం వాటిని రెండుకు కుదించారు. ఈ నిబంధనలను ఎయిర్‌లైన్స్ సంస్థలు గతంలో వ్యతిరేకించాయి. ఇక సవరించిన నిబంధనల తొలి దశ జులై 1న నుంచీ అమల్లోకి వచ్చింది. రెండో దశ రూల్స్ నవంబర్ 1 నుంచి అమల్లో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
ట్రంప్ ఎఫెక్ట్.. భారీగా ఆదాయాన్ని కోల్పోనున్న అమెరికా యూనివర్సిటీలు
సిమ్ ఉన్న ఫోన్లోనే వాట్సాప్ లాగిన్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి