Putin Praises PM Modi: అమెరికాకు బిగ్ షాక్.. ఆ విషయంలో భారత్‌కు అండగా రష్యా..
ABN , Publish Date - Dec 05 , 2025 | 03:13 PM
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. అమెరికాకు షాక్ ఇచ్చే న్యూస్ చెప్పారు. భారత్‌కు నిరంతరంగా ఇంధనాన్ని సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని పుతిన్ స్పష్టం చేశారు.
టెర్రరిజానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భారత్‌తో కలిసి నడుస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. టెర్రరిజాన్ని పూర్తిగా నాశనం చేసేందుకు భారత్‌కు అండగా ఉంటామని స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ, పుతిన్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ.. ‘మోదీతో నిర్మాణాత్మక చర్చలు జరిగాయి. భారత్ ఆతిథ్యం ఎంతో సంతోషాన్నిచ్చింది. అనేక అంశాల్లో ఇరుదేశాల మధ్య అవగాహన కుదిరింది. విభిన్న అంశాలపై పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నాం. భారత్-రష్యా మధ్య 64 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది.
ఇరుదేశాల మధ్య ట్రేడ్ మరింత పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయిల్ సహా అన్ని రంగాల్లో సహకారం అందిస్తాం. ఉమ్మడి ప్రాజెక్టులు, సాంకేతిక అంశాల్లో పరస్పర సహకారం ఉంటుంది. సొంత కరెన్సీల్లో ఇరుదేశాల మధ్య వాణిజ్యం జరుగుతోంది. కొడంకుళం అణువిద్యుత్ ప్రాజెక్టుకు సహకరిస్తాం. విద్యుత్ రంగంలో ఖర్చు తగ్గింపునకు సాయం అందిస్తాం. భారత్‌తో కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. భారత్‌కు నిరంతరంగా ఇంధనాన్ని సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు.
భారత్‌కు బ్రిక్స్ అధ్యక్ష పదవి
భారతదేశం బ్రిక్స్ అధ్యక్ష పదవిని చేపడుతుందని అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. వచ్చే ఏడాది భారతదేశం బ్రిక్స్ అధ్యక్ష పదవిని చేపడుతుందన్నారు. భారత్‌కు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తామన్నారు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపటానికి ప్రధాని మోదీ ఎంతో ప్రయత్నిస్తున్నారని చెప్పారు. యుద్ధం ఆపే ప్లాన్ గురించి తనకు వివరించి చెప్పారని అన్నారు.
ఇవి కూడా చదవండి
విద్యార్థులను స్టాన్‌ఫోర్డ్ స్థాయికి తీసుకెళ్లాలి: సీఎం చంద్రబాబు
అనుభవాన్ని అంగట్లో కొనుక్కోలేం.. రో-కోతో పెట్టుకోవద్దు: రవిశాస్త్రి