Rahul Gandhi-IndiGo Fiasco: ఇండిగో ఫ్లైట్‌ల రద్దు.. ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్
ABN , Publish Date - Dec 05 , 2025 | 01:51 PM
ప్రభుత్వ గుత్తాధిపత్య విధానాలే ఇండిగో వైఫల్యానికి కారణమని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇందుకు నిస్సహాయ ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారని అన్నారు. భారత్‌లోని ప్రతి రంగంలో న్యాయమైన పోటీ అవసరమని ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇండిగో విమానాల రద్దు ఉదంతానికి ప్రభుత్వం అనుసరిస్తున్న గుత్తాధిపత్య విధానాలే కారణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలకు పౌరులు మూల్యం చెల్లించుకుంటున్నారని ఎక్స్ వేదికగా విమర్శలు ఎక్కుపెట్టారు (Rahul Gandhi on IndiGo Flight Cancellations).
భారత్‌లోని ప్రతి రంగంలో న్యాయమైన పోటీ ఉండాలని అభిలషించారు. మ్యాచ్ ఫిక్సింగ్ తరహా గుత్తాధిపత్యానికి తావు లేదని అన్నారు. దేశ సంపద కొందరికేనా లేక అందరికా అనేది నిర్ణయించుకోవాలని అన్నారు.
కాగా, గురు, శుక్రవారాల్లో ఇప్పటివరకూ ఇండిగోకు చెందిన సుమారు 900 ఫ్లైట్ సర్వీసులు రద్దయ్యాయి. ఏం జరుగుతుందో, పరిస్థితి ఎప్పటికి స్తిమిత పడుతుందో అర్థంకాక దేశవ్యాప్తంగా వివిధ ఎయిర్‌పోర్టుల్లోని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు. ఫ్లైట్ సర్వీసుల్లో అంతరాయాలకు ఇండిగో ఇప్పటికే బహిరంగంగా క్షమాపణలు చెప్పింది. అయితే, మరో రెండు రోజుల పాటు అవాంతరాలు తప్పవని పేర్కొంది. ఈ విషయాన్ని డీజీసీఏకు కూడా తెలిపింది. ఎయిర్‌లైన్స్ సిబ్బంది డ్యూటీ షెడ్యూల్‌కు సంబంధించి కొత్త నిబంధనల కారణంగా పైలట్‌ల కొరత, ఇతర సాంకేతిక కారణాలతో విమానాలు క్యాన్సిల్ చేయాల్సి వస్తోందని ఇండిగో ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, ఈ అంశంపై పార్లమెంటులో చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేదీ ఈ అంశంపై పార్లమెంటులో అడ్జర్న్‌మెంట్ మోషన్‌ను తీసుకొచ్చారు. తృణమూల్ నేత కీర్తీ ఆజాద్ కూడా ఇండిగోపై మండిపడ్డారు. ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రజలను దోచుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి అంశంపై చార్జీలు వసూలు చేస్తూ, పండగల్లో టిక్కెట్లు రేట్లు పెంచుతూ భారీగా డబ్బు కూడబెట్టుకున్న సంస్థలే నేటి పరిస్థితికి బాధ్యులని తేల్చిచెప్పారు.
ఇవి కూడా చదవండి:
మేము తటస్థం కాదు.. శాంతి పక్షాన నిలిచాము: పుతిన్‌తో మోదీ స్పష్టీకరణ
వందల కొద్దీ విమానాల రద్దు.. ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో ప్రయాణికుల ఇక్కట్లు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి