Modi-Putin Meet: మేము తటస్థం కాదు.. శాంతి పక్షాన నిలిచాము: పుతిన్‌తో మోదీ స్పష్టీకరణ
ABN , Publish Date - Dec 05 , 2025 | 12:39 PM
ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధానితో భేటీ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. శాంతి స్థాపన కోసం ప్రధాని చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు.
ఢిల్లీ: ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. భారత ప్రధాని మోదీతో నేడు సమావేశమయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీతో కలిసి రష్యా అధ్యక్షుడు పాల్గొన్నారు (Modi-Putin Bilateral Meet).
ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ ఉక్రెయిన్-రష్యాల మధ్య శాంతిస్థాపన కోసం ప్రధాని మోదీ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు. ఇందుకు ప్రధాని మోదీ బదులిస్తూ భారత్‌ది తటస్థ వైఖరి కాదని, తాము శాంతిసౌభాగ్యాల పక్షాన ఉంటామని తెలిపారు. ఉక్రెయిన్ సంక్షోభం మొదలైన నాటి నుంచి పుతిన్ అసలైన స్నేహితుడిలా అక్కడి విషయాలను ఎప్పటికప్పుడు తనతో పంచుకున్నారని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఈ నమ్మకమే అసలైన బలమని వ్యాఖ్యానించారు. శాంతిస్థాపనతోనే దేశాలు పురోగమిస్తాయని తెలిపారు. భారత్ రష్యాలు కలిసికట్టుగా ప్రపంచాన్ని శాంతిమార్గంలో నడిపిస్తాయని అన్నారు. ఇప్పటివరకూ చేసిన ప్రయత్నాలతో ప్రపంచం మళ్లీ శాంతివైపు మళ్లుతుందన్న నమ్మకం తనకు ఉందని అన్నారు.
భారత్-రష్యా దౌత్యబంధం వెనుకున్న దార్శనికత కూడా గొప్పదని ప్రధాని మోదీ ప్రశంసించారు. ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను ప్రపంచం అధిగమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్, రష్యాలు కలిసికట్టుగా మరిన్ని ఉన్నత శిఖరాలు చేరుకునే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని పిలుపునిచ్చారు. ఇక ఈ సమావేశంలో ఇరు దేశాలు పలు ఒప్పందాలు కూడా కుదుర్చుకోనున్నాయి.
అంతకుముందు అధ్యక్షుడు పుతిన్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్ వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం, భారతదేశ త్రివిధ దళాలు రష్యా అధ్యక్షుడికి గౌరవ వందనం చేశాయి. ఆ తరువాత రాజ్‌ఘాట్‌కు చేరుకున్న పుతిన్, జాతిపిత మహాత్మాగాంధీ స్మారకం వద్ద నివాళులు అర్పించారు.
ఇవి కూడా చదవండి:
వందల కొద్దీ విమానాల రద్దు.. ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో ప్రయాణికుల ఇక్కట్లు
నావికాదళ దినోత్సవం.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి