PM Modi: ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లండి.. బిహార్ బీజేపీ కార్యకర్తలకు మోదీ దిశానిర్దేశం
ABN , Publish Date - Oct 15 , 2025 | 08:13 PM
ప్రభుత్వ పథకాలకు, పౌరులకు మధ్య వారధిగా కార్యకర్తలు నిలవాలని మోదీ అన్నారు. ప్రభుత్వ పథకాలతో ప్రజలకు ఏవిధమైన లబ్ధి చేకూరుతోందో ఇంటింటికీ వెళ్లి వారికి వివరించాలని కోరారు
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) ఓటర్లకు చేరువయ్యేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఆ రాష్ట్ర బీజేపీ బూత్ వర్కర్లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) దిశానిర్దేశం చేశారు. ప్రజలను నేరుగా కలుసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేయాలని సూచించారు. 'మేరా బూత్ సబ్సే మజబూత్' ప్రోగ్రాంలో భాగంగా 'నమో యాప్' ద్వారా ప్రధానమంత్రి పార్టీ కార్యకర్తలతో బుధవారం నాడు సంభాషించారు.
మీ ప్రాంతాల్లో మీరే మోదీ
'ప్రతి కార్యకర్త తమ తమ ఏరియాల్లో మోదీనే. నా తరఫున ప్రభుత్వ పథకాలపై ప్రజలకు గ్యారెంటీ ఇవ్వండి' అని మోదీ సూచించారు. ప్రభుత్వ పథకాలు, పౌరులకు మధ్య వారధిగా కార్యకర్తలు నిలవాలన్నారు. ప్రభుత్వ పథకాలతో ప్రజలకు ఏవిధమైన లబ్ధి చేకూరుతోందో ఇంటింటికీ వెళ్లి వారికి వివరించాలని కోరారు. ఐక్య ఎన్డీయే ఈ ఎన్నికల్లో విజయాన్ని సాధించి, రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
'జీవికా యోజన' పథకంలో లబ్దిదారుగా ఉన్న పూర్ణియాకు చెందిన బీజేపీ కార్యకర్త మేఘా దేవితో మోదీ మాట్లాడుతూ, మహిళా లబ్దిదారులను కలుసుకుని ప్రభుత్వ పథకాలతో వారికి ఏ విధంగా మేలు జరుగుతుందో వివరించాలని సూచించారు. దీపావళి పండుగ వస్తున్నందున ఇంటింటికీ వెళ్లి జీఎస్‌టీ తగ్గింపుతో మహిళలకు ఏవిధంగా లబ్ధి చేకూరుతోందో వివరించాలని, అందుకు సంబంధించిన డేటాను ఫోన్లలో రెడీ చేసుకుని ఆయా కుటుంబాలకు షేర్ చేయాలని సూచించారు. స్థానిక మహిళా గ్రూపులను కలుసుకుని వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని, వాటిని రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని పేర్కొన్నారు.
ఈసారి బిహార్‌లో రెండుసార్లు దీపావళి రానుందని, మొదటిది అక్టోబర్ 20న అయితే రెండవది నవంబర్ 14న ఎన్డీయే సాధించబోయే విజయోత్సవమని అన్నారు. ఉమెన్ ఎంప్లాయిమెంట్ స్కీమ్ ద్వారా బిహార్‌లోని 1.2 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూర్చామని చెప్పారు. కేంద్రం, నితీష్ కుమార్ ప్రభుత్వ హయాంలో అమలవుతున్న పథకాల లబ్ధిదారుల జాబితాను తయారు చేసుకోవాలని, సంక్షేమ పథకాల సక్సెస్ స్టోరీలతో కూడిన వీడియోలను తమతమ ఏరియాల్లోని కుటుంబాలకు షేర్ చేయాలని దిశానిర్దేశం చేశారు. ఓటింగ్‌ను పండుగలా జరుపుకోవాలని, కమ్యూనిటీ స్ఫూర్తిని పటిష్టం చేసేందుకు బూత్ టీమ్‌లు లంచ్ షేర్ చేసుకోవాలని అన్నారు. ఆర్జేడీ హయాంలోని ఆటవిక రాజ్యంలో ఎన్నో అకృత్యాలు జరిగాయని, అప్పటి తప్పిదాల పాలన, ప్రస్తుత అభివృద్ధి పాలనకు మధ్య తేడాను యువతకు తెలియజేసే ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. 'బూత్ పటిష్టంగా ఉంటే విజయం మరింత పటిష్టంగా ఉంటుంది' అంటూ కార్యకర్తలను మోదీ ఉత్సాహపరిచారు.
ఇవి కూడా చదవండి..
నామినేషన్ వేసిన తేజస్వి.. గెలుపు మాదేనంటూ ధీమా
బీజేపీ రెండో జాబితా.. అలీనగర్ నుంచి సింగర్ మైథిలీ ఠాకూర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి