Tejashwi Yadav Nomination: నామినేషన్ వేసిన తేజస్వి.. గెలుపు మాదేనంటూ ధీమా
ABN , Publish Date - Oct 15 , 2025 | 05:30 PM
తేజస్వి యాదవ్ రఘోపూర్ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచారు. హ్యాట్రిక్ గెలుపును ఆశిస్తున్నారు. ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతోపాటు బిహార్‌ను అభ్యుదయపథంలోకి తీసుకువెళ్లాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Electons) పోటీకి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఆర్జేడీ (RJD) నేత తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) రఘోపూర్ (Raghopur) శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీకి బుధవారం నాడు నామినేషన్ (nomination) వేశారు. వైశాలి జిల్లా హజీపూర్‌లోని కలెక్టరేట్ కార్యాలయంలో తేజస్వి(35) నామినేషన్ వేశారు. తేజస్వి తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్, తల్లి రబ్రీదేవి హాజరయ్యారు.
తేజస్వి యాదవ్ రఘోపూర్ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచారు. హ్యాట్రిక్ గెలుపును ఆశిస్తున్నారు. ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతోపాటు బిహార్‌ను అభ్యుదయపథంలోకి తీసుకువెళ్లాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు.
ఇంటింటికీ ఒక ప్రభుత్వ ఉద్యోగం
నామినేషన్ సందర్భంగా తేజస్వి మాట్లాడుతూ, రఘోపూర్ ప్రజలు తనపై నమ్మకం ఉంచి రెండుసార్లు గెలిపించారని, మూడోసారి కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని తాము సంకల్పించామని, బిహార్‌లో నిరుద్యోగితను నిర్మూలిస్తామని అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతోపాటు రాష్ట్రాన్ని అభ్యుదయం వైపు నడిపించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. రెండు సీట్లలో పోటీ చేస్తానని కొందరు ప్రచారం చేస్తున్నారని, అయితే తాను రాష్ట్రంలోని 243 సీట్లకు పోటీ చేస్తున్నానని నవ్వుతూ చెప్పారు.
జేడీయూ నితీష్‌తో లేదు
నితీష్ కుమార్ జేడీయూపై తేజస్వి విమర్శలు గుప్పించారు. జేడీయూను లలన్ సింగ్, సంజయ్ ఝా, విజయ్ చౌదరి నడిపిస్తున్నారని, నితీష్‌తో జేడీయూ ఎంతమాత్రం లేదని తేజస్వి చెప్పారు. ఆ ముగ్గురు నేతలు పార్టీని బీజేపీకి అమ్మేశారని, నితీష్ కుమార్‌ని దెబ్బతీశారని ఆరోపించారు.
లాలూ, రబ్రీని గెలిపించిన రఘోపూర్
రఘోపూర్ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి గతంలో ఎన్నికయ్యారు. బిహార్ ముఖ్యమంత్రులుగా కూడా వారు బాధ్యతలు నిర్వహించారు. కాగా, తేజస్వి మూడోసారి రఘోపూర్ నుంచి నామినేషన్ వేయడంతో ఆయన సన్నిహితులతోపాటు, కుటుంబసభ్యులు మిసా భారతి (పాటలీ పుత్ర ఎంపీ, పెద్ద సోదరి), రాజ్యసభ సభ్యుడు సంజయ్ యాదవ్ కూడా హాజరయ్యారు. తేజస్వి నామినేషన్ వేసే ముందు పాట్నాలోని లాలూ ఇంటి నుంచి హజీపూర్ సబ్ డివిజన్ కార్యాలయం వరకూ 40 కిలోమీటర్ల మేర రోడ్‌షో నిర్వహించారు.
ఇవి కూడా చదవండి..
మహాభారత్ కర్ణుడు పంకజ్ ధీర్ కన్నుమూత
మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్.. 27 మంది లొంగుబాటు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి