Bihar Elections: బీజేపీ రెండో జాబితా.. అలీనగర్ నుంచి సింగర్ మైథిలీ ఠాకూర్
ABN , Publish Date - Oct 15 , 2025 | 06:13 PM
బిహార్‌లోని మధుబని జిల్లా బేనిపట్టికి చెందిన మైథిలీ ఠాకూర్ ఇటీవల బీజేపీలో చేరారు. అవకాశం వస్తే తన సొంత నియోజకవర్గం నుంచి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని చెప్పారు. మైథిలీ ఠాకూర్‌ను బిహార్ 'స్టేట్ ఐకాన్'గా కూడా ఎన్నికల కమిషన్ గతంలో నియమించింది.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను భారతీయ జనతా పార్టీ (BJP) బుధవారం నాడు విడుదల చేసింది. 12 మంది అభ్యర్థులు, వారు పోటీ చేసే నియోజకవర్గాలను తాజాగా ప్రకటించింది. ఈసారి టికెట్ దక్కిన వారిలో ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్ (Maithili Thakur), మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రా తదితరులు ఉన్నారు. అలీనగర్ నియోజకవర్గం నుంచి మైథిలీ ఠాకూర్ పోటీ చేయనుండగా, బక్సర్ నుంచి ఆనంద్ మిశ్రా పోటీ చేస్తారు.
బిహార్‌లోని మధుబని జిల్లా బేనిపట్టికి చెందిన మైథిలీ ఠాకూర్ ఇటీవల బీజేపీలో చేరారు. అవకాశం వస్తే తన సొంత నియోజకవర్గం నుంచి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని చెప్పారు. మైథిలీ ఠాకూర్‌ను బిహార్ 'స్టేట్ ఐకాన్'గా కూడా ఎన్నికల కమిషన్ గతంలో నియమించింది. రాష్ట్రానికి సాంస్కృతిక అంబాసిడర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. క్లాసికల్, ఫోక్ సంగీతంలో శిక్షణ పొందిన ఆమెకు బిహార్ ఫోక్ మ్యూజిక్‌కు చేసిన సేవలకు సంగీత నాటక అకాడమీ 2021లో ఉస్తాద్ బిస్మిల్మా ఖాన్ యువ పురస్కారం అందజేసింది.
కాగా, మైథిలీ ఠాకూర్‌తోపాటు మరో మహిళా అభ్యర్థి ఛోటీ కుమారికి ఛాప్రా సీటును బీజేపీ కేటాయించింది. బీజేపీ మొత్తం 101 స్థానాలకు గాను ఇంతరకూ 83 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. సోమవారం నాడు తొలి జాబితాలో 71 మంది అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది. బిహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతలుగా నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరుగనుంది. నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
నామినేషన్ వేసిన తేజస్వి.. గెలుపు మాదేనంటూ ధీమా
మహాభారత్ కర్ణుడు పంకజ్ ధీర్ కన్నుమూత
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి