Share News

Online Gaming Bill: డ్రీమ్ 11తో సహా.. రియల్ మనీ ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్ నిలిపివేత..

ABN , Publish Date - Aug 23 , 2025 | 09:25 AM

ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును ఆమోదించిన తర్వాత పలు ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు మూతపడ్డాయి. Dream11, My11Circle, WinZO, Zupee, Nazara Technologies- మద్దతుగల PokerBaazi వంటి ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు తమ రియల్-మనీ ఆన్‌లైన్ గేమింగ్ ఆఫర్‌లను నిలిపివేసాయి.

Online Gaming Bill: డ్రీమ్ 11తో సహా.. రియల్ మనీ ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్ నిలిపివేత..

ఇంటర్నెట్ డెస్క్: ఈ-స్పోర్ట్‌ను ప్రమోట్ చేస్తూ.. మనీ గేమింగ్ రిస్క్‌లకు కళ్లెం వేసే కీలకమైన 'ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు' అధికారికంగా చట్టంగా మారిన సంగతి తెలిసిందే. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 'ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు-2025'ను లోక్‌సభ ఈనెల 20న ఆమోదించగా, 21న రాజ్యసభ ఆమోదం పొందింది. ఉభయసభల్లోనూ ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ చట్టం వెంటనే అమల్లోకి వచ్చింది.


ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును ఆమోదించిన తర్వాత పలు ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు మూతపడ్డాయి. Dream11, My11Circle, WinZO, Zupee, Nazara Technologies- మద్దతుగల PokerBaazi వంటి ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు తమ రియల్-మనీ ఆన్‌లైన్ గేమింగ్ ఆఫర్‌లను నిలిపివేసాయి. ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు 2025, అన్ని రకాల ఆన్‌లైన్ మనీ గేమ్‌లపై పూర్తి నిషేధాన్ని విధించింది. అదే సమయంలో ఈ-స్పోర్ట్స్, ఆన్‌లైన్ సోషల్ గేమ్‌లను ప్రోత్సహిస్తుంది. Play Games24x7 Pvt Ltd యాజమాన్యంలో నిర్వహించబడుతున్న ఆన్‌లైన్ ఫాంటసీ గేమ్ My11Circle సోషల్ మీడియా పోస్ట్‌లో నిజమైన డబ్బుతో కూడిన అన్ని గేమింగ్ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. భారత క్రికెటర్లు ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ వంటి బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఉన్న ప్రముఖ ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్ 11 కూడా తన దుకాణాన్ని మూసివేసింది.


ఈ చట్టం ప్రకారం.. డ్రీమ్ 11లో క్యాష్ గేమ్‌లు, పోటీలు నిలిపివేయబడ్డాయని అని ఆ కంపెనీ వెబ్‌సైట్ ద్వారా తెలిపింది. ఆన్‌లైన్ పోకర్ ప్లాట్‌ఫామ్ పోకర్‌బాజీని కలిగి ఉన్న నిర్వహించే మాతృ సంస్థ మూన్‌షైన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, చట్టం నేపథ్యంలో దాని రియల్-మనీ గేమింగ్ ఆఫర్‌లను నిలిపివేసిందని నజారా టెక్నాలజీస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. అలాగే.. నజారా టెక్నాలజీస్ లిమిటెడ్ 46.07 శాతం వాటాను కలిగి ఉన్న అనుబంధ సంస్థ అయిన మూన్‌షైన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, రియల్ మనీ ఆన్‌లైన్ గేమింగ్ కార్యకలాపాలను అందించడం నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.


వీటితో పాటు మొబైల్ ప్రీమియర్ లీగ్(MPL) భారతదేశంలో తన రియల్-మనీ గేమింగ్ ఆఫర్లన్నింటినీ కూడా నిలిపివేసింది. భారతదేశంలో MPL ప్లాట్‌ఫామ్‌పై డబ్బుతో కూడిన అన్ని గేమింగ్ ఆఫర్‌లను తాము నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. "మా వినియోగదారులే మా ప్రధాన ప్రాధాన్యత. కొత్త డిపాజిట్లు ఇకపై అంగీకరించబడవు, కానీ కస్టమర్లు తమ బ్యాలెన్స్‌లను సజావుగా ఉపసంహరించుకోగలరు. అయితే, ఆన్‌లైన్ మనీ గేమ్‌లు ఇకపై MPL ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉండవు" అని ఓ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. MPL కి ఆసియా, యూరప్ మరియు ఉత్తర అమెరికా అంతటా 120 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు.


గేమింగ్ ప్లాట్‌ఫామ్ జుపీ కూడా తన అన్ని చెల్లింపు గేమ్‌లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, జుపీ ఉచిత ఆటలైన లుడో సుప్రీం, లుడో టర్బో, స్నేక్స్ & ల్యాడర్స్, ట్రంప్ కార్డ్ మానియా అన్ని వినియోగదారులకు అందుబాటులో కొనసాగుతాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్, 2025 అమలు కారణంగా, రమ్మీకల్చర్‌లో యాడ్ క్యాష్, గేమ్ ప్లే నిలిపివేయబడ్డాయి. ఉపసంహరణ సేవలను ప్రారంభించడంపై ప్రభుత్వ అధికారుల నుండి స్పష్టత కోసం తాము ఎదురు చూస్తున్నట్లు రమ్మీకల్చర్ తన వెబ్‌సైట్‌లో తెలిపింది. రియల్ మనీ గేమ్‌ల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్న WinZO, దేశ చట్టానికి పూర్తిగా అనుగుణంగా బాధ్యతాయుతంగా ప్రభావితమైన ఆఫర్‌లను ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఇండియా గేమింగ్ రిపోర్ట్ 2025 ప్రకారం, ప్రపంచ గేమింగ్ యూజర్ బేస్‌లో భారతదేశం దాదాపు 20%, మొత్తం ప్రపంచ గేమింగ్ యాప్ డౌన్‌లోడ్‌లలో 15.1% వాటా కలిగి ఉంది.


ఇవి కూడా చదవండి..

నిషేధిత పాఠశాలలను ఆధీనంలోకి తీసుకున్న జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం

అంతరిక్షంలో 2035 నాటికి భారత్‌ సొంతంగా ఏర్పాటు

For More National News

Updated Date - Aug 23 , 2025 | 09:56 AM