Share News

S Jaishankar: ప్రపంచ దేశాలతో భారత్ బంధాలను ఎవరూ వీటో చేయలేరు: జైశంకర్

ABN , Publish Date - Dec 06 , 2025 | 02:59 PM

వాషింగ్టన్‌తో వాణిజ్య ఒప్పందం త్వరలోనే వాస్తవరూపం దాల్చనుందని జైశంకర్ చెప్పారు. యూఎస్‌తో వాణిజ్యం అనేది చాలా ముఖ్యమైన అంశమని, సహేతుకలైన నిబంధనలతో ముందుకు వెళ్తున్నామని అన్నారు.

S Jaishankar: ప్రపంచ దేశాలతో భారత్ బంధాలను ఎవరూ వీటో చేయలేరు: జైశంకర్
S Jaishankar

న్యూఢిల్లీ: ప్రపంచంలోని ఏ దేశంతోనైనా సంబంధాలను ఏర్పరచుకునే స్వేచ్ఛ భారత్‌కు ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) అన్నారు. ప్రపంచం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నా న్యూఢిల్లీ-మాస్కో సంబంధాలు చిరకాలంగా స్థిరంగా ఉన్నాయని చెప్పారు. వేరే దేశంలో ఇండియా సంబంధాలను వీటో చేసే హక్కు ఏ దేశానికీ లేదని స్పష్టం చేశారు. శనివారంనాడిక్కడ జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో కేంద్రమంత్రి మాట్లాడారు.


రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో రెండ్రోజుల పర్యటన జరిపిన నేపథ్యంలో జైశంకర్ తాజా వ్యాఖ్యలు చేశారు. పుతిన్‌ ఉన్నత స్థాయి పర్యటన అమెరికాతో భారత్ సంబంధాలను చిక్కుల్లో నెట్టే అవకాశాలపై అడిగినప్పుడు, వీలైనన్ని ఎక్కువ దేశాలతో సంబంధాలు కొనసాగించడం ఇండియాకు చాలా కీలకమని, ప్రపంచంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు ఎవరితో సంబంధాలు కొనసాగించాలో ఎంపిక చేసుకునే స్వేచ్ఛ భారత్‌కు ఉందని మంత్రి సమాధానమిచ్చారు.


'గత 70-80 ఏళ్లుగా ప్రపంచం ఎన్నో ఆటుపోట్లు చవిచూసింది. కానీ భారత్, రష్యా మధ్య సంబంధాలు స్థిరంగా ఉన్నాయి. చైనా లేదా యూరప్‌తో రష్యా సంబంధాల్లో ఆటుపోట్లు తలెత్తాయి. దౌత్యం అంటే మరొకరిని సంతోషపెట్టడం కాదు' అని వివరించారు. వాషింగ్టన్‌తో వాణిజ్య ఒప్పందం త్వరలోనే వాస్తవరూపం దాల్చనుందని జైశంకర్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. యూఎస్‌తో వాణిజ్యం అనేది చాలా ముఖ్యమైన అంశమని, సహేతుకమైన నిబంధనలతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. కార్మికులు, రైతులు, మధ్యతరగతి ప్రయోజనాలు తమకు ముఖ్యమని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

విమాన ఛార్జీల పెంపుపై కేంద్రం ఆగ్రహం..

ఇండిగో విమానాల రద్దు.. ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు సిద్ధం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 06 , 2025 | 03:58 PM