IndiGo Crisis - Special Trains: ఇండిగో విమానాల రద్దు.. ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు సిద్ధం
ABN , Publish Date - Dec 06 , 2025 | 12:56 PM
ఇండిగో విమానాల రద్దుతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు అండగా రైల్వే శాఖ రంగంలోకి దిగింది. పలు మార్గాల్లో అదనపు రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న రైళ్లకు అదనపు ఏసీ బోగీలను జోడించింది. రాబోయే రోజుల్లో వీటిని మరింత విస్తరిస్తామని అధికారులు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇండిగో విమానాల రద్దుతో సతమతమవుతున్న ప్రయాణికులను ఆదుకునేందుకు రైల్వే శాఖ రంగంలోకి దిగింది. విమాన ప్రయాణికుల కోసం శనివారం రైల్వే శాఖ పలుమార్గాల్లో ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న రైళ్లకు అదనపు బోగీలను జత చేసింది. ప్రత్యామ్నాయ రవాణా మార్గాలు తగినన్ని లేక అవస్థలు పడుతున్న విమానయాన ప్రయాణికుల కోసం రైల్వే ఈ చర్య తీసుకుంది. రానున్న రోజుల్లో అవసరాన్ని బట్టి మరిన్ని సర్వీసులు అందుబాటులోకి తేనుంది (IndiGo Fiasco - Indian Railways Special Trains).
సెంట్రల్, వెస్టర్న్, నార్త్ వెస్టర్న్, ఈస్టర్న్ రైల్వే పరిధిలో పలు ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వచ్చాయని రైల్వే అధికారులు తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండే పుణె-బెంగళూరు, పుణె-ఢిల్లీ, ముంబై-న్యూఢిల్లీ, ముంబై-గోవా, లఖ్నవూ-ముంబై, నాగ్‌పూర్-ముంబై, గోరఖ్‌పూర్-ముంబై రూట్‌లలో ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.
డిసెంబర్ 6 న బయలుదేరి డిసెంబర్ 8న తిరుగు ప్రయాణమయ్యేలా తూర్పు రైల్వే హౌరా-న్యూఢిల్లీ రూట్‌లో ప్రత్యేక రైలును ప్రవేశపెట్టింది. పశ్చిమతీరం వెంబడి ముంబై-మడ్గావ్ రూట్‌లో డిసెంబర్ 7న మరో ప్రత్యేక రైలు అందుబాటులోకి రానుంది. హాలిడే, వారాంతాల రద్దీని దృష్టిలో పెట్టుకుని దీన్ని ప్రవేశపెట్టారు. ఎప్పటికప్పుడు డిమాండ్‌ను పరిశీలిస్తూ అదనపు రైళ్లను ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.
అదనపు రైళ్లతో పాటు ఇప్పటికే అందుబాటులో ఉన్న రైళ్ల సామర్థ్యం పెంచేలా రైల్వే శాఖ అదనపు కోచ్‌లను కూడా జోడించింది. రాష్ట్రాల మధ్య నడిచే బెంగళూరు- అగర్తల హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్, మంగళూరు-తిరువనంతపురం ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌లకు అదనపు ఏసీ బోగీలను జత చేసింది. వివిధ జోన్‌ల పరిధిలోని 37 రైళ్లకు మొత్తం 116 అదనపు బోగీలను జత చేశామని రైల్వే అధికారులు తెలిపారు. దీంతో, 114 ట్రిప్పుల్లో అదనపు ప్రయాణ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు.
ప్రస్తుతం రోజుకు 35 వేల మంది అదనపు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నామని అధికారులు తెలిపారు. డిమాండ్ అధికంగా ఉన్న రూట్‌లల్లో పూర్తిగా ఏసీ కోచ్‌లతో ప్రత్యేక రైళ్లు నిర్వహించే అంశాన్ని కూడా రైల్వే అధికారులు పరిశీలిస్తున్నారు. ఎయిర్ ట్రావెల్‌లో ఇబ్బందులు నెలకొన్న నేపథ్యంలో ప్రతి ప్యాసెంజర్‌కు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్ట్స్ ఇవే
మేము తటస్థం కాదు.. శాంతి పక్షాన నిలిచాము: పుతిన్‌తో మోదీ స్పష్టీకరణ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి