Share News

Modi Gifts to Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్ట్స్ ఇవే

ABN , Publish Date - Dec 06 , 2025 | 10:29 AM

భారత సంస్కృతి, కళా వైభవానికి అద్దం పట్టేలా ఉన్న పలు బహుమతులను ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఇచ్చారు. మరి వీటి విశిష్టతలు ఏమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

Modi Gifts to Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్ట్స్ ఇవే
Gifts to Putin

ఇంటర్నెట్ డెస్క్: భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌‌కు ప్రధాని మోదీ పలు బహుమతులను అందజేశారు. భారత సాంస్కృతిక వైభవానికి, హస్తకళా నైపుణ్యానికి, ఇరు దేశాల బంధానికి ఉన్న ప్రాముఖ్యతకు ప్రతీకగా నిలిచేలా వీటిని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. మరి ఈ బహుమతుల విశిష్టతలు ఏంటో తెలుసుకుందాం పదండి (Modi Gifts to Putin).

భగవద్గీత

అన్ని కాలాల్లో మానవులకు మార్గదర్శనం చేసే భగవద్గీత రష్యన్ అనువాదాన్ని పుతిన్‌కు ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. నైతికత, స్థితప్రజ్ఞ అలవడేలా, మనిషి జీవితాన్ని ఆధ్యాత్మికంగా సుసంపన్నం చేసేలా జగద్గురువు శ్రీ కృష్ణుడు అందించిన సందేశాన్ని అక్కడి యువతరానికి చేర్చేలా రష్యన్ భాషలోకి అనువదించి ఇచ్చినట్టు తెలిపారు.

అస్సాం బ్లాక్ టీ

పుతిన్‌కు భారత ప్రధాని అస్సాం బ్లాక్‌ టీని కూడా బహుమతిగా ఇచ్చారు. అస్సాం అంటే ముందుగా గుర్తొచ్చేది ఈ టీనే అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. సంప్రదాయక పద్ధతుల్లో ప్రాసెస్ చేసే ఈ టీకి 2007లో జీఐ ట్యాగ్ వచ్చింది. ఈ టీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇలా భారతీయ రుచులకు చిహ్నంగా నిలుస్తున్న టీని ప్రధాని మోదీ అధ్యక్షుడు పుతిన్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు.

టీ సెట్

అస్సాం బ్లాక్ టీకి జతగా వెండి టీ సెట్‌ను కూడా ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడికి ఇచ్చారు. అందమైన డిజైన్‌లు ఉన్న ఈ టీసెట్‌ను పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో రూపొందించారు.


వెండి గుర్రపు బొమ్మ

ఇక మహారాష్ట్ర హస్తకళల వైభవానికి చిహ్నంగా నిలుస్తున్న వెండి గుర్రపు బొమ్మను కూడా ప్రధాని మోదీ రష్యా అధినేతకు బహుమానంగా ఇచ్చారు. హుందాతనానికి చిహ్నంగా నిలిచే గుర్రానికి రష్యా, భారత్ సంస్కృతుల్లో ప్రాధాన్యత ఉంది. ఉమ్మడి విలువలకు అద్దం పట్టేలా ఉన్న ఈ గుర్రపు బొమ్మను రష్యా అధ్యక్షుడికి బహుమతిగా ఇచ్చేందుకు నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు.

మార్బుల్ చెస్ సెట్

చదరంగంలో ఎందరో ప్రతిభావంతులను రష్యా ప్రపంచానికి అందించింది. ఈ వైభవాన్ని ప్రతిబింబించేలా పుతిన్‌కు మార్బుల్ చెస్ సెట్‌ను ప్రధాని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆగ్రాలో దీన్ని రూపొందించారు. అక్కడి కళాకారుల ప్రతిభకు అసలైన నిర్వచనంగా నిలుస్తున్నందున ప్రభుత్వం దీన్ని ఎంపిక చేసింది.

కశ్మీరీ కుంకుమపువ్వు

ఇక ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయిన కశ్మీరీ కుంకుమ పువ్వును కూడా ప్రధాని మోదీ అధ్యక్షుడు పుతిన్‌కు ఇచ్చారు. అత్యంత సుగంధ భరితమైన, సాంస్కృతిక ప్రాధాన్యం కలిగినందుకు కుంకుమ పువ్వును కేంద్ర ప్రభుత్వం ఎంచుకుందని అధికారులు తెలిపారు.


ఇవి కూడా చదవండి:

మేము తటస్థం కాదు.. శాంతి పక్షాన నిలిచాము: పుతిన్‌తో మోదీ స్పష్టీకరణ

వందల కొద్దీ విమానాల రద్దు.. ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో ప్రయాణికుల ఇక్కట్లు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 06 , 2025 | 11:13 AM