BJP MP Sujeet Kumar: స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని ఏళ్లు గడిచినా అదే పదమా? బీజేపీ ఎంపీ ఫైర్
ABN , Publish Date - Dec 06 , 2025 | 01:54 PM
స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచిపోయినా ఇంకా లార్డ్ అనే పదం స్కూలు పుస్తకాలు, అధికారిక వెబ్‌సైట్‌లల్లో కనిపిస్తుండటంపై బీజేపీ ఎంపీ సుజిత్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: బ్రిటీష్ వలసపాలకులు ప్రవేశపెట్టిన లార్డ్ పదం ఇప్పటికీ భారత్‌లో ఉనికిలో ఉండటంపై బీజేపీ ఎంపీ సుజిత్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్కూలు పుస్తకాలు, ఎన్‌సీఈఆర్‌టీ ప్రచురణలు మొదలు ప్రభుత్వ దస్త్రాలు, అధికారిక వెబ్‌సైట్‌లల్లో కూడా ఇంకా ఈ పదం కనిపిస్తుండటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచిపోయినా ఇంకా బ్రిటన్ వైస్రాయ్‌లు, గవర్నర్‌ల పేర్ల ముందు లార్డ్ పదం కొనసాగుతుండటంపై మండిపడ్డారు. వీటిని తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం పార్లమెంటులో జీరో అవర్ సందర్భంగా ఈ విషయాన్ని ఆయన లేవనెత్తారు (BJP MP Sujeet Kumar). లార్డ్ పదాన్ని కొనసాగించడం వలసవాద భావజాలాన్ని కొనసాగించడమేనని ఆయన అన్నారు. సాంస్కృతిక శాఖ, పీఐబీ, పురావస్తు శాఖ వెబ్‌సైట్స్, బిహార్ రాజ్‌భవన్ (లోక్ భవన్) కూడా ఈ వలసపాలన బిరుదు కనిపిస్తోందని అన్నారు.
‘బ్రిటీష్ పాలనలో వలసపాలకులు తమ విస్తరణవాద, ఆధిపత్య భావజాలానికి చిహ్నంగా ఈ బిరుదును తమకు తామే ఇచ్చుకున్నారు. తమని తాము భగవంతుడితో సమానమని గర్వపడ్డారు. కానీ దేశ ప్రజలపై దారుణాలకు ఒడిగట్టారు. ఇలాంటప్పుడు లార్డ్ పదాన్ని ఇంకా కొనసాగించడం సబబు కాదు. మరోవైపు, స్వాతంత్ర్య సమరయోధులకు మాత్రం ఇలాంటి గౌరవపదాలు ఏమీ లేవు. అతిపెద్ద అతిపురాతన ప్రజాస్వామిక దేశమైన భారత్‌లో ఇంకా ఈ పదాలను ఉంచడం వలసపాలన భావజాలాన్ని కొనసాగించడమే’ అని అన్నారు. ఢిల్లీలోని రాజ్‌పథ్‌ను కర్తవ్యపథ్‌గా ప్రధాని మోదీ మార్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. 76వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రధాని మోదీ ప్రసంగించినట్టు భారత జీవనంలో ప్రతి పార్శ్వంలో చొచ్చుకుపోయిన బానిస మనస్తత్వాన్ని వదుల్చుకోవాలని అన్నారు.
ఇవి కూడా చదవండి:
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్ట్స్ ఇవే
వందల కొద్దీ విమానాల రద్దు.. ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో ప్రయాణికుల ఇక్కట్లు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి