Share News

NIA chargesheet on Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడి ప్రధాని సూత్రధారి సాజిద్ జాట్.. ఎన్ఐఏ ఛార్జిషీట్..

ABN , Publish Date - Dec 15 , 2025 | 08:21 PM

హహల్గాం దాడిలో పాకిస్థాన్ కుట్ర, నిందితుల పాత్ర, వాటిని బలపరచే సాక్ష్యాలను ఛార్జిషీటులో ఎన్ఐఏ చేర్చింది. నిషేధిత ఎల్ఈటీ/టీఆర్‌ఎఫ్ సంస్థ ఈ కుట్రకు ప్రణాళిక రచించి దాన్ని అమలు చేసినట్టు తెలిపింది.

NIA chargesheet on Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడి ప్రధాని సూత్రధారి సాజిద్ జాట్.. ఎన్ఐఏ ఛార్జిషీట్..
Pahalgam attack

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) కేసులో దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) సోమవారంనాడు జమ్మూలోని ప్రత్యేక కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. దాడి ప్రధాన సూత్రధారిగా పాకిస్థాన్‌‌ నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తొయిబా (LeT) కమాండర్ జాజిద్ జాట్ (Sajid Jatt)ను పేర్కొంది. హహల్గాం దాడి కేసులో లష్కరే తొయిబా, దాని ఫ్రంట్ ఆర్గనేజైషన్ 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' (TRF)తో సహా ఏడుగురు నిందితులపై ఎన్ఐఏ ఛార్జిషీటు నమోదు చేసింది.


హహల్గాం దాడిలో పాకిస్థాన్ కుట్ర, నిందితుల పాత్ర, వాటిని బలపరచే సాక్ష్యాలను ఛార్జిషీటులో ఎన్ఐఏ చేర్చింది. నిషేధిత ఎల్ఈటీ/టీఆర్‌ఎఫ్ సంస్థ ఈ కుట్రకు ప్రణాళిక రచించి దాన్ని అమలు చేసినట్టు తెలిపింది. మతం పేరు అడిగిమరీ పాక్ స్పాన్సర్డ్ ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడ్డారని, ఒక పౌరుడు సహా 25 మంది టూరిస్టులను పొట్టనపెట్టుకున్నారని పేర్కొంది. ఈ మేరకు 1,597 పేజీల ఛార్జిషీటును ప్రత్యేక కోర్టుకు ఎన్ఐఏ సమర్పించింది.


ఉగ్రదాడి అనంతరం జూలైలో చేపట్టిన ఆపరేషన్ మహదేవ్‌లో భారత బలగాలు మట్టుబెట్టిన ముగ్గురు పాక్ ఉగ్రవాదుల పేర్లను కూడా ఛార్జిషీటులో ఎన్ఐఏ చేర్చింది. ఈ ఉగ్రవాదులను ఫైసల్ జాట్ అలియాస్ సులేమాన్ షా, హబీబ్ తాహిర్ అలియాస్ జిబ్రాన్, హమ్జా అఫ్గానిగా పేర్కొంది. ఈ ముగ్గురితో పాటు సాజిద్ జాట్, ఎల్‌ఈటీ/టీఆర్‌ఎఫ్‌పై భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్) 2023, ఆయుధాల చట్టం-1959, చట్టవిరుద్ధ కార్యాకలాపాల నిరోధక చట్టం-1967లోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలను మోపింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారనే కారణంగా జూన్ 22న అరెస్టు చేసిన మరో ఇద్దరు నిందితులు పర్వెజ్ అహ్మద్, బషీర్ అహ్మద్‌ల పేర్లను కూడా ఛార్జిషీటులో ఎన్ఐఏ చేర్చింది. ఇంటరాగేషన్‌లో ఈ ఇద్దరూ దాడిలో ప్రమేయమున్న మరో ముగ్గురు సాయుధ ఉగ్రవాదుల వివరాలను వెల్లడించారు. ఈ ముగ్గురూ ఎల్‌ఈటీ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేసిన పాక్ ఉగ్రవాదులని అంగీకరించారు.


ఎవరీ సాజిద్ జాట్

పాక్‌కు చెందిన మోస్ట్ వాంటెండ్ టెర్రరిస్టు సాజిద్ జాట్. ఇతనిపై ఎన్ఐఏ రూ.10 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. అతని అసలు పేరు హబీబుల్లా మాలిక్. పాకిస్థాన్‌ పంజాబ్ ప్రావిన్స్‌లోని కసూర్ జిల్లావాసి. సైఫుల్లా, నోమి, నూమన్, లంగ్డా, అలీ సాజిద్, ఉస్మాన్ హబీబ్, షాని అనే పేర్లు కూడా ఇతనికి ఉన్నాయి. టీఆర్ఎఫ్ టాప్ కమాండర్‌గా జమ్మూకశ్మీర్‌లో జరిగిన పలు ప్రధాన ఉగ్రదాడుల్లో ఇతని ప్రమేయం ఉంది. 2022 అక్టోబర్‌లో యూఏపీఏ కింద అధికారికంగా వాంటెడ్ టెర్రరిస్టుగా ప్రకటించారు. ఇస్లామాబాద్‌లో ఎల్ఈటీ ప్రధాన కార్యాలయం నుంచి ఇతను భారత్‌లో ఉగ్రవాదాన్ని నడిపించే నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నాడని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. భారత ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారంటూ సాజిత్ జాట్‌పై పలు ఛార్జిషీటు సైతం ఎన్ఐఏ నమోదు చేసింది. కశ్మీర్‌లో పాక్ ప్రేరేపిత టెర్రర్ నెట్‌వర్క్‌ను నడుపుతున్న అత్యత ప్రమాదకరమైన వ్యక్తుల్లో ఒకరిగా సాజిద్‌ను భద్రతా సంస్థలు చెబుతున్నాయి.


ఇవి కూడా చదవండి..

నితిన్ నబీన్‌ను పార్టీ చీఫ్‌గా ప్రకటించక పోవడం వెనుక బీజేపీ వ్యూహం ఇదే

నియంత భయపడుతున్నారు... మమతపై బీజేపీ వివాదాస్పద పోస్టు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 15 , 2025 | 08:31 PM