Maratha Quota Demand: రేపట్నించి మంచినీళ్లు కూడా ముట్టను.. మనోజ్ జారంగే హెచ్చరిక
ABN , Publish Date - Aug 31 , 2025 | 02:50 PM
ఆందోళనకారులు పెద్దసంఖ్యలో ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్‌కు చేరుకోవడంతో ఆ ప్రాంతంలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. వాహనదారులను ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిందిగా సూచిస్తున్నట్టు ముంబై ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ముంబై: మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్ల డిమాండ్ నెరవేరేంత వరకూ తాను ముంబై విడిచిపెట్టేది లేదని మరాఠా కోటా ఉద్యమకారుడు మనోజ్ జారంగే (Manoj Jarange) తెలిపారు. తన డిమాండ్ రాజ్యాంగబద్ధమని, కుంబీలు, మరాఠాలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని ప్రభుత్వ రికార్డులు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. మరాఠా కోటా డిమాండ్ సాధన కోసం జారంగే చేపట్టిన నిరాహార దీక్ష ఆదివారం నాడు మూడో రోజుకు చేరుకుంది.
ఆందోళనకారులు పెద్దసంఖ్యలో ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ (CSMT)కు చేరుకోవడంతో ఆ ప్రాంతంలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. వాహనదారులను ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిందిగా సూచిస్తున్నట్టు ముంబై ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మరాఠా ప్రజలు ఎంతో ఆవేదనతో ఆందోళనలో పాల్గొనేందుకు ముంబై వచ్చారని, వారిని 'క్రౌడ్'గా చూడవద్దని ప్రభుత్వాన్ని జారంగే కోరారు. 43 ఏళ్ల జారంగే దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో శుక్రవారం నుంచి నిరాహార దీక్ష చేపట్టారు. మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని, వారిని కుంబీలుగా గుర్తించి ఓబీసీలో చేర్చాలని, అప్పుడే ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లకు వారు అర్హులవుతారని జారంగే చెబుతున్నారు.
నీళ్లు కూడా తాగను
'ప్రభుత్వం మా డిమాండ్ల అంగీకరించనందున రేపట్నించి మంచినీళ్లు కూడా ముట్టను. కోటా డిమాండ్ నెరవేరేంత వరకూ ముంబై నుంచి వెనక్కి వెళ్లేది లేదు. ఏదిఏమైనా ఓబీసీ కేటగిరిలో మరాఠా రిజర్వేషన్లను సాధించి తీరుతాం' అని జారంగే స్పష్టం చేశారు. తన మద్దతుదారులు వాహనాలను నిర్దిష్ట పార్కింగ్ స్లాట్స్‌లో ఉంచి రైలులో ఆజాద్ మైదాన్‌కు రావాలని ఆయన కోరారు. ఆహారం సరఫరా ట్రక్కులు వాసీ, చెంబూరు, సెవ్రి, మాస్జిద్ బందర్, ఇతర ప్రాంతాల్లో ఉన్నాయని, అక్కడ ఆహారం తీసుకుని ఆజాద్ మైదాన్‌కు రావాలని సూచించారు. పంపిణీ చేస్తున్న గొడుగులు, రెయిన్‌కోటులకు డబ్బులు చెల్లించనవసరం లేదని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
‘ప్రతిభా సేతు’ ద్వారా కొత్త అవకాశాలు.. మన్ కీ బాత్‌లో మోదీ ప్రకటన..
రాహుల్ యాత్రకు మమత డుమ్మా .. స్పందించిన టీఏంసీ
For More National News And Telugu News