Fevers: బాబోయ్ ఫీవర్.. చెన్నైలో పెరుగుతున్న జ్వరాల వ్యాప్తి
ABN , Publish Date - Aug 31 , 2025 | 01:08 PM
చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూర్ జిల్లాల్లో కొద్దిరోజులుగా జ్వరాలు ప్రబలు తున్నాయి. జ్వరాలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే వారు అధికమవుతున్నారు. రాజధాని నగరం చెన్నైలో మాత్రమే జ్వరంతో బాధపడుతూ సుమారు 1,000 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
చెన్నై: చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూర్(Chennai, Chengalpattu, Kanchipuram, Tiruvallur) జిల్లాల్లో కొద్దిరోజులుగా జ్వరాలు ప్రబలు తున్నాయి. జ్వరాలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే వారు అధికమవుతున్నారు. రాజధాని నగరం చెన్నైలో మాత్రమే జ్వరంతో బాధపడుతూ సుమారు 1,000 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా తదితర జ్వరాల వ్యాప్తి అధికంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నగరంలో కొద్దిరోజులుగా సాయంత్రం, రాత్రి వేళల్లో మోస్తరు వర్షం, పగటి వేళల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటూ వాతావరణం తరచూ మారుతుండడంతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు.
ఒళ్లు నొప్పులు, పొడి దగ్గు, చలి జ్వరాలకు చికిత్సలు పొందినా వెంటనే నయం కావడం లేదు. కొంతమందికి రెండు వారాలకు పైగా ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి ఉంటున్నాయి. వాతావరణం మార్పులతో వ్యాప్తి చెందుతున్న ఈ జ్వరాల బారిన వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు అధికంగా బాధపడుతున్నారు. ఈ విషయమై వైద్య నిపుణులు మాట్లాడుతూ... నగరంలో వాతావరణ మార్పుల కారణంగా వైరస్ జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని, ప్రస్తుతం 70 శాతానికి పైగా ‘ఇన్‌ఫ్లుయింజా’ జ్వరం వ్యాప్తి ఉందన్నారు.
అలాగే, డెంగ్యూ జ్వరం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. అడపాదడపా వర్షాలు కురిస్తే మంచినీటిలో వృద్ధి చెందే ‘ఎడిస్’ దోమల పెరుగుదల అధికమయ్యే అవకాశముందన్నారు. ప్రజలు తమ ఇళ్లు, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు ఆకు కూరలు, పండ్లు, వ్యాధి నిరోధక శక్తి పెంచే ఆహార పదార్థాలు తీసుకోవాలని, తరచూ చేతులు శుభ్రపరచుకోవడం, మాస్క్ ధరించడం వంటి చర్యల ద్వారా వైరల్ జ్వరాల బారిన పడకుండా ఉండవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ రోజుకో మాట మాట్లాడుతోంది..
బలమైన అన్నాడీఎంకేను కోరుకుంటున్నారు..
Read Latest Telangana News and National News