Share News

Tejas Mk-1A Delivery: సెప్టెంబర్ నెలాఖరు కల్లా ఎయిర్ ఫోర్స్ చేతికి రెండు తేజస్ ఎమ్‌కే-1ఏ ఫైటర్ జెట్స్

ABN , Publish Date - Aug 31 , 2025 | 02:08 PM

వచ్చే నెలాఖరు కల్లా హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ ఎయిర్‌ఫోర్స్‌కు రెండు తేజస్ ఎమ్‌కే-1ఏ యుద్ధ విమానాలను డెలివరీ చేస్తుందని డిఫెన్స్ సెక్రెటరీ తెలిపారు. పూర్తిస్థాయి వెపన్స్ ఇంటెగ్రేషన్‌తో విమానాలు డెలివరీ అవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Tejas Mk-1A Delivery: సెప్టెంబర్ నెలాఖరు కల్లా ఎయిర్ ఫోర్స్ చేతికి రెండు తేజస్ ఎమ్‌కే-1ఏ ఫైటర్ జెట్స్
HAL Tejas Mark-1A Delivery

ఇంటర్నెట్ డెస్క్: తేజస్ యుద్ధ విమానాల డెలివరీలో జాప్యం జరుగుతోందంటూ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ గతంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. సెప్టెంబర్ నెలాఖరు కల్లా రెండు తేజస్ ఎమ్‌కే-1ఏ యుద్ధ విమానాలను హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ ( హెచ్ఏఎల్) ఎయిర్‌ఫోర్స్‌కు అందజేయనుంది. ఈ విషయాన్ని డిఫెన్స్ సెక్రెటరీ ఆర్‌కే సింగ్ శనివారం వెల్లడించారు. ఆ తరువాత మరో 97 తేజస్ యుద్ధ విమానాల డెలివరీకి ఎయిర్‌ఫోర్స్‌తో హెచ్ఏఎల్ ఒప్పందం కుదుర్చుకుంటుందని కూడా తెలిపారు. పూర్తిస్థాయి వెపన్స్ (ఆయుణధాలు) ఇంటెగ్రేషన్‌తో ఈ రెండు తేజస్ యుద్ధ విమానాలు డెలివరీ అవ్వొచ్చని అన్నారు.


ఇప్పటికే హెచ్ఏఎల్, ఎయిర్‌ఫోర్స్ మధ్య యుద్ధ విమానాల డెలివరీకి ఒప్పందం ఉంది. అయితే, విమానాల తయారీలో జాప్యంపై ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఇటీవల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తేజస్‌లో అమర్చే ఇంజెన్‌ను అమెరికాకు చెందిన జీఈ ఎయిరోస్పేస్ తయారు చేస్తోందని, వాటి డెలివరీలో జాప్యం కారణంగా తేజస్ జెట్స్ డెలివరీలో ఆలస్యం అవుతోందని హెచ్ఏఎల్ అప్పట్లో తెలిపింది.

ప్రస్తుతమున్న మిగ్-21 ఫైటర్ జెట్‌ల స్థానంలో సింగిల్ ఇంజెన్ యుద్ధ విమానం తేజస్ ఎమ్‌కే-1ఏ‌ను ప్రవేశపెట్టాలని రక్షణ శాఖ భావిస్తోంది. ఇప్పటికే 38 తేజస్ ఫైటర్‌ జెట్స్ వాయుసేనలో ఉన్నాయి. 83 తేజస్ జెట్స్ సరఫరా కోసం 2021 ఫిబ్రవరిలో హాల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో మరో 97 తేజస్ ఫైటర్‌లను ఎయిర్‌ఫోర్స్‌లోకి తీసుకునేందుకు కేంద్రం సిద్ధమైంది. తేజస్ ఫైటర్‌కు మరింత అత్యాధునిక మెరుగులు దిద్దే సత్తా హెచ్‌ఏఎల్‌కు ఉందని డిఫెన్స్ సెక్రెటరీ అన్నారు. సుఖోయ్‌ ఫైటర్ జెట్స్‌తో సమానంగా వాయుసేనలో తేజస్ సేవలందించగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు.


భారత్ రక్షణ రంగ వ్యూహాలకు తేజస్ కీలకమని డిఫెన్స్ వర్గాలు చెబుతున్నాయి. విదేశీ ఆయుధాలపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు తేజస్ జెట్ ఉపకరిస్తుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

భారత యుద్ధ నౌకలన్నీ స్వదేశంలోనే తయారవుతాయి: రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

1991 లోక్‌సభ ఎన్నికల్లో నన్ను మోసపూరితంగా ఓడించారు: సీఎం సిద్దరామయ్య

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 31 , 2025 | 02:18 PM