Maratha Quota Talks Fail: మనోజ్ జారంగేతో చర్చలు విఫలం.. కొనసాగుతున్న నిరాహార దీక్ష
ABN , Publish Date - Aug 30 , 2025 | 09:46 PM
జస్టిస్ సందీప్ షిండే కమిటీ కాలపరిమితిని రాష్ట్ర ప్రభుత్వం సోమవారంనాడు మరో ఆరు నెలలు పొడిగించింది. హైదరాబాద్ గెజిట్‌లోని చారిత్రక రికార్డుల ఆధారంగా మరాఠాలకు కుంబి సర్టిఫికెట్లు ఇచ్చే అవకాశాలని కమిటీ పరిశీలిస్తోంది.
ముంబై: మరాఠా కోటా ఉద్యమ కార్యకర్త మనోజ్ జారంగే పాటిల్ (Manoj Jarange Patil) ఆజాద్ మైదాన్‌లో ప్రారంభించిన నిరాహార దీక్ష శనివారంనాడు రెండో రోజుకు చేరుకుంది. జారంగే, ప్రభుత్వ ప్రతినిధులు మధ్య చర్చల్లో ఈరోజు ఎలాంటి పురోగతి కనిపించలేదు.
ఆందోళనకారుల డిమాండ్లను చట్ట పరిధిలో, రాజ్యాంగానికి లోబడి పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హామీ ఇచ్చారు. ఒకరోజు కేవలం 5,000 మంది మాత్రమే నిరసనల్లో పాల్గొనాలని కోర్టు సైతం ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో మనోజ్ జారంగే నిరాహార దీక్ష కొనసాగిస్తుండటంతో మహారాష్ట్ర రాజకీయ వాతావరణం క్రమేపీ వేడెక్కుతోంది.
ఈ క్రమంలో స్టిస్ సందీప్ షిండే కమిటీ కాలపరిమితిని రాష్ట్ర ప్రభుత్వం సోమవారంనాడు మరో ఆరు నెలలు పొడిగించింది. హైదరాబాద్ గెజిట్‌లోని చారిత్రక రికార్డుల ఆధారంగా మరాఠాలకు కుంబి సర్టిఫికెట్లు ఇచ్చే అవకాశాలని కమిటీ పరిశీలిస్తోంది. మరాఠాలు ఓబీసీ కేటిగిరి కింద రిజర్వేషన్ పొందేందుకు వీలుగా కుంబి హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత శుక్రవారం నుంచి జారంగే నిరసన దీక్ష ప్రారంభించారు. చర్చలకు రిటైర్డ్ న్యాయమూర్తి సందీప్ షిండేను పంపడాన్ని కూడా జారంగే తప్పుపట్టారు. గవర్న్‌మెంట్ రిజల్యూషన్ (GR) జారీ చేసే పని జస్టిస్ షిండేది కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్, సతారా గిజిట్లను ప్రస్తావిస్తూ మరాఠ్వాడాలోని మరాఠాలందరినీ కుంబీలుగా గుర్తించాలని జారంగే బలంగా వాదన వినిపిస్తున్నారు.
కాగా, చట్టం, రాజ్యాంగ పరిధిలో ఆందోళనకారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఫడ్నవిస్ తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (SEBC) కేటగిరి నుంచి 10 శాతం రిజర్వేషన్లను గత ఏడాది కేటాయించామని, ఇప్పటికీ అది అమల్లో ఉందని ఆయన తెలిపారు.
నిరసనలు
మరోవైపు, వందలాది మంది కోటా మద్దతుదారులు ముంబైలోని పలు చోట్ల నిరసనలకు దిగుతున్నారు. బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కార్యాలయం వెలుపల ఆందోళనకారులు పెద్దఎత్తున నిరసనలకు దిగారు. పలుచోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆందోళనకారులు సౌత్ ముంబైలో రోడ్లను దిగ్బంధం చేశారు.
ఇవి కూడా చదవండి..
పార్లమెంటు కాంప్లెక్స్‌లో జగన్నాథ రథ చక్రాలు
చొరబాట్ల స్పెషలిస్ట్ బాగూఖాన్ ఖేల్ ఖతం.. ఎన్‌కౌంటర్‌లో హతం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి