Karnataka: బడ్జెట్‌లోపే తేల్చాలి.. సీఎం మార్పుపై కర్ణాటక మంత్రి
ABN , Publish Date - Dec 30 , 2025 | 06:27 PM
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన పరమేశ్వర గత నెలలో తాను కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని చెప్పారు. దళిత సామాజిక వర్గానికి చెందిన నేతను సీఎం చేయాలని కర్ణాటక కాంగ్రెస్‌లో ఒక వర్గం డిమాండ్ చేస్తోంది.
బెంగళూరు: కర్ణాటకలో నాయకత్వ మార్పు అంశంపై ఆ రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర (G Parameshwara) మంగళవారంనాడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నాయకత్వం అంశంపై పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా వచ్చే ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సన్నాహకాలకు ముందే ఆ పని చేయాలని అన్నారు. నాయకత్వాన్ని మార్చాలా వద్దా అనేది కాంగ్రెస్ అధిష్టానమే నిర్ణయిస్తుందని మంగళవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
'ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రిపరేషన్ మొదలవుతుంది. అందుకు సుమారు నెలరోజులు పడుతుంది. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగానే బడ్జెట్ రూపకల్పన అనేది ఉంటుంది. ఒకవేళ నాయకత్వ మార్పుపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాలనుకుంటే బడ్జెట్‌కు ముందే నిర్ణయం తీసుకోవాల్సి ఉటుంది' అని మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కొందరు సీఎంగా పరమేశ్వరకు పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేయడంపై అడిగినప్పుడు, తనపై అభిమానంతోనే అలా అని ఉండవచ్చని, వాళ్లను అలా మాట్లాడవద్దని తానెలా చెప్పగలనని పరమేశ్వర ప్రశ్నించారు. ఎవరిని సీఎం చేయాలి? ఎప్పుడు చేయాలి? నాయకత్వం మార్పు చేపట్టాలా? వద్దా? అనే అంశాలన్నీ పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు.
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన పరమేశ్వర గత నెలలో తాను కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని చెప్పారు. దళిత సామాజిక వర్గానికి చెందిన నేతను సీఎం చేయాలని కర్ణాటక కాంగ్రెస్‌లో ఒక వర్గం డిమాండ్ చేస్తోంది. ఆ డిమాండ్‌ను అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటే పార్టీ సీనియర్ దళిత నేతల్లో పరమేశ్వర కూడా ఉన్నారు.
బడ్జెట్ సమర్పించేది నేనే
కాగా, రికార్డు స్థాయిలో 17వ బడ్జెట్‌ను తాను త్వరలో అసెంబ్లీకి సమర్పించనున్నట్టు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గత నెలలో ప్రకటించారు. ఆర్థిక మంత్రిగా కూడా ఉన్న సిద్ధరామయ్య గత మార్చిలో 16వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2026-27 బడ్జెట్‌ను వచ్చే ఏడాది మార్చిలో ప్రవేశపెట్టాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
దుశ్శాసనుడు వచ్చారు.. అమిత్‌షాపై విరుచుకుపడిన మమత
నేషనల్ గ్రిడ్‌తో చొరబాటుదారుల ఆటకట్టు.. ఆమిత్‌షా
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి