Share News

PM Modi: శాంతికి విఘాతం కలిగించే చర్యలొద్దు.. పుతిన్ నివాసంపై దాడిని ఖండించిన మోదీ

ABN , Publish Date - Dec 30 , 2025 | 03:48 PM

రష్యాలోని నోవ్‌గరొడ్ ప్రాంతంలోని పుతిన్ నివాసంపై ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం డ్రోన్లతో దాడికి ఉక్రెయిన్ ప్రయత్నించిందని, 91 దీర్ఘశ్రేణి డోన్లను ఆ దేశం ప్రయోగించిందని రష్యా విదేశాంగ మంత్రి లవ్రోవ్ ధ్రువీకరించారు.

PM Modi: శాంతికి విఘాతం కలిగించే చర్యలొద్దు.. పుతిన్ నివాసంపై దాడిని ఖండించిన మోదీ
Narendra Modi with Putin

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) నివాసంపై ఉక్రెయిన్ (Ukraine) దీర్ఘశ్రేణి డ్రోన్లతో దాడికి ప్రయత్నించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆందోళన వ్యక్తం చేశారు. శాంతికి దౌత్యం ఒక్కటే సరైన మార్గమని పేర్కొన్నారు. తాజా పరిణామాలపై తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని, ఇలాంటి చర్యల వల్ల మరింత ఉద్రిక్తతలు పెరుగుతాయని అన్నారు. శాంతి ప్రయత్నాలపైనే ఇరువర్గాలు దృష్టిసారించాలని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో మోదీ కోరారు.


రష్యాలోని నోవ్‌గరొడ్ ప్రాంతంలోని పుతిన్ నివాసంపై ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం డ్రోన్లతో దాడికి ఉక్రెయిన్ ప్రయత్నించిందని, 91 దీర్ఘశ్రేణి డోన్లను ఆ దేశం ప్రయోగించిందని రష్యా విదేశాంగ మంత్రి లవ్రోవ్ ధ్రువీకరించారు. అయితే వీటిని నిర్వీర్యం చేశామమని, ఇలాంటి చర్యల వల్ల రష్యా సంప్రదింపుల ప్రక్రియపై తీవ్ర ప్రభావం ఉంటుందని హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై సరైన సమయంలో దాడిచేసే హక్కు తమకుందని స్పష్టం చేశారు.


రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందానికి సంప్రదింపులు సాగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించారు. తాను చాలా ఆగ్రహంతో ఉన్నట్టు చెప్పారు. పుతిన్ స్వయంగా తనకు ఫోన్ చేసి దాడి సమాచారం తెలియజేశారని అన్నారు. చైనా సైతం ఈ పరిణామంపై స్పందించింది. యుద్ధభూమిలో అగ్నికి ఆజ్యం పోయరాదని, ఎలాంటి ఉద్రిక్తతలకు తావులేకుండా ఇరుపార్టీలు కట్టుబడి ఉండాలని కోరింది. కాగా, దాడి సమయంలో పుతిన్ తన నివాసంలో ఉన్నారా లేరా అనేది వెంటనే తెలియలేదు. అయితే పుతిన్ నివాసంపై దాడుల ఆరోపణ పూర్తిగా కట్టుకథ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఖండించారు. యుద్ధాన్ని ముగించడం రష్యాకు ఇష్టం లేదని ఆరోపించారు.


ఇవి కూడా చదవండి..

పుతిన్‌ నివాసాలపై దాడికి ఉక్రెయున్‌ ప్రయత్నం!

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 30 , 2025 | 03:51 PM