Share News

Amit Shah: నేషనల్ గ్రిడ్‌తో చొరబాటుదారుల ఆటకట్టు.. ఆమిత్‌షా

ABN , Publish Date - Dec 30 , 2025 | 02:51 PM

మమతా బెనర్జీ సర్కార్‌పై అమిత్‌షా విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజలకు ఉద్దేశించిన కేంద్ర సంక్షేమ పథకాలను బెంగాల్ సీఎం అడ్డుకుంటున్నారని విమర్శించారు.

Amit Shah: నేషనల్ గ్రిడ్‌తో చొరబాటుదారుల ఆటకట్టు.. ఆమిత్‌షా
Amit Shah

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ (West Bengal)లో బీజేపీ(BJP) అధికారంలోకి వస్తే చొరబాటుదారులను (Infiltrators) వెనక్కి పంపుతామని కేంద్ర హోం మంత్రి హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) తెలిపారు. దేశంలోకి చొరబాటుదారులను నిలువరించేందుకు నేషనల్ గ్రిడ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పశ్చిమబెంగాల్‌లో మూడ్రోజుల పర్యటనలో భాగంగా మీడియాతో మంగళవారంనాడు ఆయన మాట్లాడారు.


'బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే బెంగాల్ వారసత్వాన్ని, అభివృద్ధిని పునరుద్ధరిస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నాం. పేద ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తాం. చొరబాట్లకు అడ్డుకట్ట వేసేందుకు నేషనల్ గ్రిడ్ ఏర్పాటు చేస్తాం' అని అమిత్‌షా తెలిపారు.


ప్రజాసంక్షేమ పథకాలకు మోకాలడ్డు

మమతా బెనర్జీ సర్కార్‌పై అమిత్‌షా విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజలకు ఉద్దేశించిన కేంద్ర సంక్షేమ పథకాలను బెంగాల్ సీఎం అడ్డుకుంటున్నారని విమర్శించారు. గత 14 ఏళ్లలో మమతా బెనర్జీ పాలనలో అవినీతి, భయాందోళనలు పెరిగిపోయాయన్నారు. ప్రభుత్వ అవినీతి కారణంగా బెంగాల్ అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. 2026 ఏప్రిల్ 15 తర్వాత బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే బెంగాల్ వారసత్వం, సంస్కృతిని పునరుద్ధరిస్తామని చెప్పారు.


మూడింట రెండువంతుల మెజారిటీతో..

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడింట రెండు వంతుల మెజారిటీతో అధికారంలోకి వస్తుందని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 17 శాతం ఓట్లు, రెండు సీట్లు సాధించిందని, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 10 శాతం ఓట్లు, 3 అసెంబ్లీ సీట్లు గెలుచుకుందని చెప్పారు. అదే 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 41 శాతం ఓట్లు 18 సీట్లు సాధించిందని, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 21 శాతం ఓట్లు, 77 సీట్లు గెలుచుకుందని గుర్తు చేశారు. 2016లో కేవలం 3 సీట్లు గెలుచుకున్న బీజేపీ కేవలం 5 ఏళ్లలో 77 సీట్లు గెలుచుకోగలిగిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జీరో స్థాయికి చేరుకుందని, కమ్యూనిస్టు కూటమి ఒక్క సీటు కూడా దక్కించుకోలేదని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 39 శాతం ఓట్లు 12 సీట్లు గెలుచుకుందని, 2026లో బీజేపీ మెజారిటీ సాధించిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. బెంగాల్ సరిహద్దు నుంచే చొరబాట్లు జరుగుతున్నాయని, ఇక్కడ నుంచి చొరబాట్లను నిలిపివేసి, చొరబాటుదారులను వెనక్కి పంపించే ప్రధాన అంశంపైనే బెంగాల్ ఎన్నికల్లో తమ పార్టీ ఎన్నికలకు వెళ్తుందని తెలిపారు. 2026 ప్రథమార్ధంలో పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఎన్నికల తేదీలను ఎలక్షన్ కమిషన్ ప్రకటించాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి..

ఏం డౌట్ వద్దు.. మళ్లీ వచ్చేది డీఎంకే పాలనే

ఖలీదా జియా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 30 , 2025 | 02:56 PM