Share News

Unnao case: సెంగార్‌ బెయిల్‌పై స్టే

ABN , Publish Date - Dec 30 , 2025 | 04:05 AM

సంచలనం సృష్టించిన 2017 ఉన్నావ్‌ రేప్‌ కేసులో నిందితుడు,బీజేపీ మాజీ ఎమ్మెల్యే కులదీప్‌ సింగ్‌ సెంగార్‌కు ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిలును సుప్రీంకోర్టు సోమవారం నిలిపివేసింది. బాధితురాలి తండ్రి కస్టోడియల్‌ మరణం, ఆమె బంధువులు, న్యాయవాది అనుమానాస్పద మృతి, చివరికి బాధితురాలిని కూడా.....

Unnao case: సెంగార్‌ బెయిల్‌పై స్టే

  • ఉన్నావ్‌ రేప్‌ దోషికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

  • ఢిల్లీ హైకోర్టు తీర్పుపై నిలుపుదల ఉత్తర్వులు

  • పదిహేనేళ్ల మైనర్‌పై అత్యాచారం ఘోరం

  • బాధితురాలికి మనం అండగా నిలవాలి: సీబీఐ

  • ఉరిశిక్ష పడే వరకూ పోరాటం ఆగదు: బాధితురాలు

న్యూఢిల్లీ, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): సంచలనం సృష్టించిన 2017 ఉన్నావ్‌ రేప్‌ కేసులో నిందితుడు,బీజేపీ మాజీ ఎమ్మెల్యే కులదీప్‌ సింగ్‌ సెంగార్‌కు ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిలును సుప్రీంకోర్టు సోమవారం నిలిపివేసింది. బాధితురాలి తండ్రి కస్టోడియల్‌ మరణం, ఆమె బంధువులు, న్యాయవాది అనుమానాస్పద మృతి, చివరికి బాధితురాలిని కూడా చంపే ప్రయత్నం చేసిన సంఘటనల క్రమంలో ఢిల్లీ హైకోర్టు నిందితుడికి బెయిలు ఇవ్వడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో బెయిలును సవాలుచేస్తూ సీబీఐ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తూ సెంగార్‌ బెయిలును నిలిపివేసింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఒక నిందితుడికి కింది కోర్టు బెయిలు ఇచ్చినపుడు అతని వాదన వినకుండా బెయిలు రద్దు చేయరాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే, ఈ కేసులో బెయిలు వచ్చినప్పటికీ వేరే కేసులో అతను ఇప్పటికీ జైల్లోనే ఉన్నందున ఈ కేసులో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో బెయిలు నిలిపివేత నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించింది. సీబీఐ పిటిషన్‌పై 4వారాల్లో సమాధానం ఇవ్వాలని సెంగార్‌ను ఆదేశించింది. విచారణను జనవరి 20కి వాయిదా వేసింది. సీబీఐ తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మాట్లాడుతూ.. బాలిక మీద జరిగిన ఘోర అత్యాచారమని, బెయిలు రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. పదిహేను సంవత్సరాల 10 నెలల వయస్సులో ఈ ఘాతుకానికి బలయిన బాలిక విషయంలో మనమంతా జవాబుదారులమేనని వ్యాఖ్యానించారు. సంఘటన జరిగినపుడు ఆ ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్న సెంగార్‌ అక్కడ శక్తివంతుడైన వ్యక్తి అని చెప్పారు. ఢిల్లీ హైకోర్టు ఈ నెల 23న సెంగార్‌కు బెయిలు ఇచ్చినపుడు పోక్సో చట్టంలోని సెక్షన్‌ 5(సి) కింద ఆయన మీద కేసు పెట్టారని, ఆ సెక్షన్‌లో పేర్కొన్న పబ్లిక్‌ సర్వెంట్‌ కిందకు ఎమ్మెల్యే రాడని అభిప్రాయపడింది. 5(సి) సెక్షన్‌ ప్రకారం పబ్లిక్‌ సర్వెంట్‌ తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని బాలికపై అత్యాచారానికి పాల్పడితే తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. బీఎన్‌ఎస్‌ 21 ప్రకారం పబ్లిక్‌ సర్వెంట్‌ అంటే న్యాయమూర్తులు, పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది వస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యే మీద 5(సి) సెక్షన్‌ పెట్టారు. ఎమ్మెల్యేకు 5సీ వర్తించదన్న వాదనను హైకోర్టు అంగీకరించింది.


బాధితురాలు మైనర్‌ అయినందున పబ్లిక్‌ సర్వెంట్‌ అంటే ఎవరు అనే సాంకేతిక అంశాల జోలికి పోవద్దన్నది సీబీఐ వాదన అంతే కదా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అవునని సీబీఐ తరఫున తుషార్‌ మెహతా బదులిచ్చారు. పోక్సో చట్టానికి ఇతర చట్టాలేవైనా విరుద్ధంగా ఉంటే పోక్సో చట్టమే చెల్లుబాటు కావాలని అన్నారు. కేవలం 7 ఏళ్లు జైలులో ఉన్నారనే కారణాన్ని చూపుతూ హైకోర్టు బెయిల్‌ ఇవ్వడం సరికాదని చెప్పారు. సవరించిన చట్టం ప్రకారం 20 ఏళ్ల జైలు శిక్ష విధించాలని కోరారు. నేరం జరిగినప్పటికిఆ చట్ట సవరణ రాలేదు కదా? అని సీజేఐ ప్రశ్నించారు. ‘‘ఆర్మీ అధికారి విధుల్లో ఉండి తప్పు చేస్తే ఎలా శిక్షార్హుడో, ఎమ్మెల్యే కూడా అంతే. సెంగార్‌ బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు. బాధితురాలి తండ్రి, బంధువుల హత్య కేసులోనూ సెంగార్‌ దోషిగా తేలారు. శిక్ష అనుభవిస్తున్నాడు. బయటికి వస్తే బాధితురాలికి తీరని అన్యాయం జరిగినట్లే. బాధితురాలికి మనం అండగా ఉన్నామని చెప్పడం ఎంతో ముఖ్యం’’ అని తుషార్‌ మెహతా వాదించారు.

పట్వారీ పబ్లిక్‌ సర్వెంట్‌... ఎమ్మెల్యే కాదా?

సెంగార్‌ తరఫు న్యాయవాదులు బెయిలును రద్దు చేయొద్దని కోరారు. సెంగార్‌ న్యాయవాదుల వాదనలోనూ బలం ఉందని, అయితే, ఇప్పుడు బెయిలు రద్దు చేస్తున్నది కూడా ఈ అంశాన్ని నిశితంగా పరిశీలించేందుకేనని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే, సెంగార్‌ న్యాయవాదులు చెప్పినట్లు చట్టాన్ని సాంకేతికంగానే తీసుకుంటే ఊళ్లో పట్వారీ, స్టేషన్లో కానిస్టేబుల్‌ కూడా పబ్లిక్‌ సర్వెంట్‌గా ఈ సెక్షన్‌ పరిధిలోకి వస్తున్నారని, ఎంపీ, ఎమ్మెల్యే రావడం లేదని, ఇది ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించింది. హైకోర్టులో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులిద్దరూ భారత న్యాయవ్యవస్థలోని శ్రేష్టమైన న్యాయమూర్తుల్లో భాగమని, వాళ్లు లోతైన విశ్లేషణ చేశారని, అయితే, అందరం మానవమాత్రులమేనని, ఎవరైనా పొరపాటు చేసే అవకాశం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు తీర్పు మీద బాధితురాలికి కూడా స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేసే అధికారం ఉందని చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకొని, జాతీయ మీడియాలో, సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ చేస్తున్నారని, దీన్ని ఆపాలని సెంగార్‌ తరఫు న్యాయవాది సూచించారు. ఈ కేసులో రాజకీయ లబ్ధి కోసం కొందరు ప్రయత్నిస్తున్నారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.


అద్వానీ కేసు ప్రస్తావన

సీబీఐ పిటిషన్‌లో అద్వానీ కేసును, అప్పట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక ఉత్తర్వులను ప్రస్తావించింది. 1997లో రాజకీయ నాయకులపై వచ్చిన జైన్‌ డైరీ అవినీతి ఆరోపణల కేసులో ఎంపీలు, ఎమ్మెల్యేలు పబ్లిక్‌ సర్వెంట్లు అవుతారా? కాదా? అనే ప్రశ్న తలెత్తింది. అప్పుడు సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు(ఎంపీలు, ఎమ్మెల్యేలు) అవినీతి నిరోధక చట్టం ప్రకారం కచ్చితంగా పబ్లిక్‌ సర్వెంట్ల కిందికే వస్తారని తేల్చి చెప్పింది. అవినీతి వంటి ఆర్థిక నేరాలకే ఎమ్మెల్యేలను పబ్లిక్‌ సర్వెంట్లుగా పరిగణిస్తున్నప్పుడు చిన్న పిల్లలపై జరిగే లైంగిక దాడుల వంటి తీవ్రమైన నేరాల విషయంలో వారిని ఆ పరిధి నుంచి ఎలా మినహాయిస్తారని సీబీఐ తన పిటిషన్‌లో ప్రస్తావించింది.

మరణశిక్ష పడే వరకూ పోరాటం ఆగదు..

సెంగార్‌కు మరణశిక్ష పడే వరకూ తన పోరాటం ఆగదని బాధితురాలు తెలిపారు. సెంగార్‌కు ఉరిశిక్ష పడినప్పుడే తన తండ్రికి, తనకు న్యాయం జరుగుతుందని తెలిపారు. దేశ అత్యున్నత న్యాయస్థానంపై తనకు అపారమైన నమ్మకం ఉందన్నారు. మరోవైపు, తన తండ్రికి న్యాయం కావాలని కోరుతూ సెంగార్‌ కుమార్తె ఇషిత ఎక్స్‌ వేదికగా బహిరంగ లేఖ విడుదల చేశారు. తన తండ్రి ఎదుర్కొంటున్న విచారణ కారణంగా తన కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని లేఖలో స్పష్టం చేశారు. ఒక కూతురిగా ఎంతో అలసిపోయానని, ఇంకా చిన్న ఆశ ఏదో మిగిలివుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సుప్రీం నిర్ణయాన్ని మహిళా కాంగ్రెస్‌ స్వాగతించింది. ఇది న్యాయానికి దక్కిన విజయమని మహిళా కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షురాలు అల్కా లాంబా అన్నారు. సెంగార్‌ను రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాగా, హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ నిరసన తెలిపేందుకు వచ్చిన వందల మంది మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - Dec 30 , 2025 | 05:49 AM