Sharad Pawar: ఠాక్రేల బాటలో పవార్‌లు!
ABN , Publish Date - Dec 30 , 2025 | 03:48 AM
మహారాష్ట్రలో విడిపోయిన రాజకీయ కుటుంబాలు స్థానిక ఎన్నికల వేళ ఒక్కటవుతున్నాయి. ముంబై కార్పొరేషన్‌పై పట్టు నిలబెట్టుకునేందుకు ఇప్పటికే ఉద్ధవ్ శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే, ఆయన సోదరుడు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత.....
మహారాష్ట్ర మున్సిపోల్స్ కోసం అజిత్, శరద్ పొత్తు
ముంబై, డిసెంబరు 29: మహారాష్ట్రలో విడిపోయిన రాజకీయ కుటుంబాలు స్థానిక ఎన్నికల వేళ ఒక్కటవుతున్నాయి. ముంబై కార్పొరేషన్‌పై పట్టు నిలబెట్టుకునేందుకు ఇప్పటికే ఉద్ధవ్ శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే, ఆయన సోదరుడు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే ఒక్కటయ్యారు. ఇప్పుడు అదే బాటలో ఎన్‌సీపీ వర్గాల అధినేతలు అజిత్ పవార్, ఆయన బాబాయి శరద్ పవార్ జట్టుకట్టారు. పింప్రి-చించ్వాడ్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ, ఆయన బాబాయి శరద్ పవార్ సారథ్యంలోని ఎన్‌సీపీ(ఎ్‌సపీ) పొత్తు కుదుర్చుకున్నాయి. కుటుంబమంతా ఒక్క చోటకు చేరిందని అజిత్‌పవార్ ఆదివారం ప్రకటించారు. తమ గుర్తు గడియారం, పవార్ పార్టీ గుర్తు బాకా కలిసిపోయాయన్నారు. పొత్తుపై పలు సందేహాలు రేగాయని.. మహారాష్ట్ర అభివృద్ధి కోసం కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందన్నారు. పుణే కార్పొరేషన్‌లోనూ రెండు పార్టీలూ కలిసి పోటీచేయడంపై చర్చలు జరిగాయి. అయితే పవార్ ఎన్‌సీపీ ఎక్కువ డివిజన్లు డిమాండ్ చేయడంతో అజిత్ ఇంతవరకు పొత్తు ఖరారుచేయలేదు. ఈ రెండు సహా 29 కార్పొరేషన్లకు నామినేషన్ల దాఖలుకు మంగళవారం వరకు గడువుంది.