CM Stalin: ఏం డౌట్ వద్దు.. మళ్లీ వచ్చేది డీఎంకే పాలనే
ABN , Publish Date - Dec 30 , 2025 | 01:34 PM
ఏం డౌట్ అవసరం లేదు.. మళ్లీ వచ్చేది డీఎంకే పాలనే.. అని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. ఆయన మాట్లాడుతూ... డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో తయారీ చేసే బాధ్యత కూడా ఎంపీ కనిమొళికి అప్పగించానని తెలిపారు. డీఎంకేకు అధికారం ఖాయం అని ఆయన అన్నారు.
- తిరుప్పూరు మహిళా మహానాడులో సీఎం స్టాలిన్
చెన్నై: వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి ఘనవిజయం సాధిస్తుందని, అదే సమయంలో రెండోమారు అధికారంలోకి రానున్న ద్రావిడ తరహా పాలన మహిళాభ్యుదయానికే అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister MK Stalin) పేర్కొన్నారు. తిరుప్పూరు జిల్లా పల్లడం మైదానంలో ‘వెల్లుమ్ తమిళగ పెణ్‌గళ్’ పేరుతో డీఎంకే మహిళా విభాగం పడమటి మం డల మహానాడు ఆ విభాగం అధ్యక్షురాలు, ఎంపీ కనిమొళి అధ్యక్షతన జరిగింది.
ఈ మహానాడులో పాల్గొన్న ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ ఈ మహానాడుకు హాజరైన మహిళలను చూస్తూంటే మరోమారు డీఎంకేకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారనే భావన తనకు కలుగుతోందన్నారు. మహానాడును ఇంత గొప్పగా ఏర్పాట్లు చేపట్టిన తన సోదరి కనిమొళి బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. రానున్నది మహిళా సంక్షేమ పాలన కనుకనే ప్రస్తుతం డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో తయారీ చేసే బాధ్యత కూడా కనిమొళికి అప్పగించానని తెలిపారు. రాష్ట్రంలో పెరియార్, అన్నాదురై వంటి మహాపురుషులు మహిళాభ్యుదయం కోసమే తీవ్రంగా పాటుపడ్డారని గుర్తు చేశారు.
డీఎంకేకు ముందున్న జస్టీస్ పార్టీ తొలి సమావేశం 1914లో జరిగిందని, ఆ సమావేశంలో తొలిసారిగా ఓ మహిళ పాల్గొందని, ఆమే పేరే అలమేలు మంగతాయరమ్మాళ్ అని స్టాలిన్ తెలి పారు. 1949లో డీఎంకే ఆవిర్భావంలో సత్యవాణి ముత్తు వంటి మహిళా ప్రముఖులు కీలక పాత్ర పోషించారన్నారు. 1956లో అన్నాదురై పార్టీలో మహిళలకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారని, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆ విభాగానికి మరింత జవసత్వాలు కలిగించారని, అప్పటి నుండి డీఎంకేలో ఈ మహిళా విభాగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

చదువులకు దూరంగా వంటింటికే పరిమితమైన మహిళలకు విముక్తి కలిగించింది డీఎంకే మాత్రమేనని, ప్రస్తుతం అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం మహిళలకు అమ లు చేస్తున్న పథకాలతో వారిలో ఆర్థిక స్థోమత పెరిగిందన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత కూడా తమ పార్టీకే దక్కుతుందన్నారు. ఇక కేంద్రంలోని బీజేపీ పాలకులు ఎల్లప్పుడూ మహిళా వ్యతిరేక ధోరణినే ప్రదర్శిస్తుంటారని, ఆ కారణంగా పార్లమెంట్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు అమలుకు నోచుకోకుం డా అణచివేసిందని స్టాలిన్ ఆరోపించారు.
ఈ మహానాడులో మంత్రులు దురైమురుగన్, కేఎన్ నెహ్రూ, సామినాధన్, ముత్తుసామి, కయల్‌విళి సెల్వరాజ్, ఎంపీలు తిరుచ్చి శివా, ఎ.రాజా, అందియూరు సెల్వరాజ్, మాజీ మంత్రి పొన్ముడి, సెంథిల్‌బాలాజీ, పార్టీ వ్యవస్థాపక కార్యదర్శి ఆర్‌ఎస్ భారతి, మహిళా విభాగం కార్యదర్శి హెలెన్ డేవిడ్‌సన్ తదితరులు పాల్గొన్నారు. కోయంబత్తూరు, తిరుప్పూరు, ఈరోడ్, నామక్కల్, కరూర్, నీలగిరి జిల్లాలకు చెందిన 35 నియోజకవర్గాల పరిధిలోని డీఎంకే మహిళా విభాగం నాయకులు, కార్యకర్తలు వేలాదిమంది ఈ మహానాడులో పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News