Share News

Pregnancy Planning: గర్భధారణ 30 ఏళ్లలోపే...

ABN , Publish Date - Dec 30 , 2025 | 06:15 AM

లేటు వయసులో సైతం పిల్లలను కనే వైద్యపరమైన వెలుసుబాట్లు అందుబాటులోకొచ్చాయి. కాబట్టి నచ్చినప్పుడు పిల్లలను కనవచ్చని అనుకోవడం పొరపాటు...

Pregnancy Planning: గర్భధారణ 30 ఏళ్లలోపే...

ప్రెగ్నెన్సీ

లేటు వయసులో సైతం పిల్లలను కనే వైద్యపరమైన వెలుసుబాట్లు అందుబాటులోకొచ్చాయి. కాబట్టి నచ్చినప్పుడు పిల్లలను కనవచ్చని అనుకోవడం పొరపాటు.

ఆరోగ్యవంతమైన బిడ్డల కోసం, ముప్పై ఏళ్ల లోపే గర్భం దాల్చడం మేలని సూచిస్తున్నారు వైద్యులు.

ఉద్దేశపూర్వకంగా గర్భధారణను ఆలస్యం చేయడం, లేదా ఆలస్యంగా గర్భం దాల్చే పరిస్థితులను కొని తెచ్చుకోవడం వల్ల అటు తల్లి మీదా, ఇటు బిడ్డ మీదా దుష్ప్రభావం పడే వీలుంటుంది. ఉరుకుల పరుగుల జీవితాలు, ఒత్తిడిలు, ఎక్కువ సమయాల పాటు కూర్చుని చేసే ఉద్యోగాలతో, పని వేళలతో మహిళలకు వ్యాయామం కొరవడుతోంది. వీటి మూలంగా సంతానోత్పత్తికి అడ్డుపడే ఆరోగ్య సమస్యలు మొదలవుతున్నాయి. ఇవన్నీ గర్భధారణకు అడ్డుపడే ఆరోగ్య సమస్యలే కాబట్టి వీటిని సరిదిద్దుకునేలోగా వయసు పైబడిపోతోంది.

థైరాయిడ్‌: విపరీతమైన ఒత్తిడి మూలంగా హైపో లేదా హైపర్‌ థైరాయిడ్‌ సమస్యలు మొదలవుతున్నాయి. ఈ రెండు సమస్యలూ గర్భధారణకు అడ్డుపడేవే!

స్థూలకాయం: వ్యాయామ లోపం, జంక్‌ఫుడ్‌ మూలంగా చిన్న వయసులోనే మహిళలు స్థూలకాయులుగా తయారవుతున్నారు. అధిక బరువు పాలీసిస్టిక్‌ ఓవరీస్‌ మొదలైన ఇతరత్రా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

మధుమేహం: టీనేజీ వయసులోనే మధుమేహానికి గురయ్యే మహిళల సంఖ్య పెరుగుతోంది. ఇందుకు కారణం కూడా ఆహార, జీవనశైలి లోపాలే!

అబార్షన్లు: కొన్ని కనెక్టివ్‌ టిష్యూ డిజార్డర్ల మూలంగా వరుసగా గరస్రావాలు జరుగుతూ ఉంటాయి. కారణాన్ని లోతుగా పరిశీలిస్తే కనెక్టివ్‌ టిష్యూ డిజార్డర్‌ సమస్య బయటపడుతూ ఉంటుంది. ఇలా వరుస గర్భస్రావాలతో బిడ్డను కనే వయసు మించిపోతూ ఉంటుంది.


ఏ వయసు ఉత్తమం?

20, 22 ఏళ్ల వయసు గర్భధారణకు అనువైన వయసు. ఈ వయసులో నాణ్యమైన అండాలను కలిగి ఉంటారు. గర్భధారణ జరిగే అవకాశాలు కూడా ఈ వయసు మహిళలకే ఎక్కువగా ఉంటాయి. కానీ ఇప్పటి రోజుల్లో ఈ వయసులో పెళ్లిళ్లకు సిద్ధపడే అమ్మాయిలు చాలా తక్కువ. అయితే ఉన్నత చదువులు, కెరీర్‌ కోసం ఇంకొంత సమయాన్ని తీసుకోవాలనుకునే అమ్మాయిలు కనీసం 25 నుంచి 30, 32 ఏళ్ల లోపు తొలి బిడ్డను ప్రసవించేలా ప్లాన్‌ చేసుకోవాలి. ఈ వయసు మహిళల్లో గర్భధారణ అవకాశాలు ప్రతి నెలలో, 25 శాతం మేరకు ఉంటాయి. ప్రసవాలకు మధ్య స్పేసింగ్‌ కూడా మెరుగ్గా ఉండేలా చూసుకోవచ్చు. అయితే ఈ వయసు కూడా దాటిపోయి 35 ఏళ్లకు చేరుకునేటప్పటికి అండాల నాణ్యత తగ్గుముఖం పడుతుంది. దాంతో గర్భధారణ అవకాశాలు తగ్గి, ఇన్‌ఫెర్టిలిటీ సమస్యలు పెరుగుతాయి. ఈ సమస్యలను సరిదిద్దుకుని గర్భం దాల్చే సమయానికి వయసు మరింత పెరిగిపోతుంది. కాబట్టి వీలైనంత ముందుగానే 30 ఏళ్ల లోపే గర్భాన్ని ప్లాన్‌ చేసుకోవడం ఉత్తమం.

గర్భధారణ ప్లానింగ్‌ ఇలా...

గర్భం ధరించాలని ప్లాన్‌ చేసుకునే మహిళలు మూడు నెలల ముందు నుంచే అందుకు శరీరాన్ని ఇలా సిద్ధం చేయాలి.

ఫోలిక్‌ యాసిడ్‌: బిడ్డ నాడీ వ్యవస్థ ఎదుగుదలకు తోడ్పడే పోషకం ఇది. ఫోలిక్‌ యాసిడ్‌ లోపంతో గర్భంలోని బిడ్డలో స్కాల్ప్‌ ఏర్పడదు. అలాగే కొన్ని వెన్ను సంబంధ లోపాలు కూడా తలెత్తవచ్చు. ఈ సమస్యలన్నిటినీ ఫోలిక్‌ యాసిడ్‌తో నియంత్రించవచ్చు. కాబట్టి గర్భధారణకు కొన్ని నెలల ముందు నుంచే ఫోలిక్‌ యాసిడ్‌ తీసుకోవడం అవసరం.

ఆరోగ్య సమస్యలు: థైరాయిడ్‌, మధుమేహం, రక్తలేమి లాంటి సమస్యలేవీ లేవని పరీక్షలతో నిర్థారించుకోవాలి. ఆ సమస్యలను అదుపులో ఉంచుకోవాలి. రక్తలేమితో గర్భం దాల్చడం వల్ల పిల్లలు తక్కువ బరువుతో లేదా నెలలు నిండకుండా పుట్టే అవకాశాలుంటాయి.

అధిక బరువు: బరువు ఎక్కువగా ఉంటే, దాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి.

డైట్‌: జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉంటూ, ప్రొటీన్‌ ఎక్కువగా, పిండి పదార్థాలు తక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు, సిట్రస్‌ పండ్ల్లు, హీమోగ్లోబిన్‌ కోసం ముదు రు రంగు పండ్లు, కూరగాయలు ఆహారం లో చేర్చుకోవాలి. స్వీట్లు బాగా తగ్గించాలి.

వ్యాయామం: వృత్తుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కనీసం వారంలో ఐదు రోజుల పాటైనా రోజుకు 45 నిమిషాల పాటు వ్యాయామానికి కేటాయించాలి. ఇలా ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ సాధించినా గర్భం ధరించే అవకాశాలు పెరుగుతాయి.

సప్లిమెంట్లు: పోషక లోపాలుంటే, వాటిని వైద్యుల సూచన మేరకు సప్లిమెంట్లతో భర్తీ చేసుకోవాలి.


30 దాటితే...

అబార్షన్లు: 35 నుంచి 40 ఏళ్లు దాటిన మహిళల్లో అండాల నాణ్యత తగ్గడం వల్ల అబార్షన్లయ్యే అవకాశాలు ఎక్కువ.

క్రోమోజోమ్‌ సమస్యలు: గర్భం దాల్చగలిగినా, పుట్టే పిల్లల్లో క్రోమ్‌జోమ్‌ సమస్యల మూలంగా డౌన్స్‌ సిండ్రోమ్‌ లాంటి జన్యు సమస్యలు తలెత్తవచ్చు.

మధుమేహం: మధుమేహంతో గర్భం దాలిస్తే, గర్భంలోని బిడ్డ బరువు ఎక్కువగా పెరిగిపోయి, సాధారణ ప్రసవం సాధ్యం కాకపోవచ్చు. గర్భిణుల్లో చక్కెరలు ఎక్కువగా ఉంటే, పుట్టే బిడ్డలో గుండె సమస్యలు, అవయవ లోపాలు తలెత్తవచ్చు.

అధిక రక్తపోటు: గర్భిణికి అధిక రక్తపోటు ఉంటే, ఫిట్స్‌ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇవి తల్లికీ, బిడ్డకూ ప్రమాదకరం. అధిక రక్తపోటు వల్ల, గర్భాశయంలోని మాయ విచ్చుకుపోయి, గర్భంలోనే బిడ్డ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది.

నెలలు నిండకుండా: లేటు వయసులో గర్భం దాల్చిన మహిళలకు, పిల్లలు నెలలు నిండకుండా పుట్టే అవకాశాలు ఎక్కువ.

సిజేరియన్‌: సాధారణ ప్రసవం కష్టతరమై, సిజేరియన్‌ అవకాశాలు పెరుగుతాయి.

డాక్టర్‌ ఎమ్‌. ప్రత్యూష రెడ్డి,

కన్సల్టెంట్‌ అబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ,

బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో

హాస్పిటల్స్‌, హైదరాబాద్‌.

ఇవి కూడా చదవండి

వివాహ వేడుకలోకి అతిథుల్లా వచ్చారు.. అంతా చూస్తుండగానే..

బురదలో ఆహారం కోసం వెతుకుతున్న చిరుత.. చివరకు ముందున్న దృశ్యం చూసి..

Updated Date - Dec 30 , 2025 | 06:16 AM