KCR Sparks Speculation: 2న మళ్లీ సభకు వస్తారా?
ABN , Publish Date - Dec 30 , 2025 | 06:15 AM
ఆయన అసెంబ్లీ సమావేశాలకు హజరవుతారా? లేదా? అంటూ గత కొన్నాళ్లుగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెర వేశారు...
కేసీఆర్ రాకపై రాజకీయ వర్గాల్లో చర్చ
హైదరాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఆయన అసెంబ్లీ సమావేశాలకు హజరవుతారా? లేదా? అంటూ గత కొన్నాళ్లుగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెర వేశారు. సోమవారం ఎట్టకేలకు శాసనసభలో వచ్చి కూర్చున్నారు. సభలోకి వచ్చిన కొద్ది నిమిషాలకే బయటకు వెళ్లిపోయారు. అయితే, ఆయన చర్య గులాబీ శ్రేణుల్లో ఎక్కడలేని ఉత్సాహాన్ని నింపింది. వెంటనే ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన కేసీఆర్ తిరిగి కొత్త సంవత్సరం రెండో రోజు నుంచి జరిగే సమావేశాలకు వస్తారా? లేదా? అనే కొత్త చర్చ రాజకీయ వర్గాల్లో, సామాజిక మాధ్యమాల్లో మొదలైంది. కేసీఆర్ తప్పకుండా సభకు వస్తారని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా జలాల అంశంపై మాట్లాడతారని బీఆర్‌ఎస్ శ్రేణులు గట్టిగా నమ్ముతున్నాయి. సోమవారం కేసీఆర్ శాసనసభకు రావడం ఖరారు కావడంతో అసెంబ్లీ ప్రాంగణంలో ఉదయమే పార్టీ ఎమ్మెల్యేలు ఆయనకు స్వాగతం పలికేందుకు వేచి ఉన్నారు. దాంతో అక్కడంతా హడావుడి కనిపించింది. బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, తదితరులు కేసీఆర్‌కు స్వాగతం పలికారు. ఆయన మొదట అసెంబ్లీ లాబీలో తనకు కేటాయించిన ప్రతిపక్ష నేత ఛాంబర్‌లోకి వెళ్లారు. అక్కడే సభకు సంబంధించిన హాజరు నమోదు పత్రంలో సంతకం చేశారు. తర్వాత అసెంబ్లీ హాల్లోకి వెళ్లి కూర్చున్నారు. కొద్ది నిమిషాల్లోనే తన నివాసానికి బయలుదేరి వెళ్లారు.
నిపుణులతో చర్చలు జరుపుతున్న కేసీఆర్
ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా జలాల అంశంపై చర్చ జరుపుదామని, కేసీఆర్ సభకు రావాలంటూ ఈ మధ్యకాలంలో అధికార పార్టీ నేతలు సవాల్ విసురుతున్నారు. ఈ నేపథ్యంలోనే జనవరి రెండు లేదా మూడో తేదీన కేసీఆర్ శాసనసభకు వస్తారని బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీలో చర్చించే అంశాలపై స్పష్టత వచ్చాక, చర్చించే అంశాలను బట్టి కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా, గత ప్రభుత్వాల ప్రతిపాదనలు, బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక తీసుకున్న నిర్ణయాలపై కేసీఆర్ మాట్లాడతారని సమాచారం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న వైఖరి వల్ల రెండు జిల్లాల రైతులకు ఎలాంటి నష్టం జరగనుందో కేసీఆర్ ప్రస్తావిస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఇదే అంశంపై క్షేత్రస్థాయి కార్యాచరణ సిద్ధం చేసి, ప్రజల్లోకి వెళ్తారని అంటున్నారు. రెండు అంశాలపై అసెంబ్లీ వేదికగా ఏం చెప్పాలి? ఇప్పటివరకు ఎదురైన ఇబ్బందులు, భవిష్యత్‌లో ఏర్పడే ప్రమాదాలు వంటి వాటిపై కేసీఆర్ సంబంధిత నిపుణులతో చర్చలు జరుపుతూ సన్నద్ధం అవుతున్నారని బీఆర్‌ఎస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు.