Share News

INDIA Alliance: ఇండియా కూటమి నేడు కీలక నిర్ణయం.. ఉపరాష్ట్రపతి రేస్‌లో ఎవరు ముందున్నారు?

ABN , Publish Date - Aug 18 , 2025 | 07:27 AM

దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఇండియా కూటమి నేతలు జోరు పెంచారు. తమ ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసేందుకు ఈరోజు కీలక భేటీ జరగనుంది. దీంతో ఎవరిని ఎంపిక చేస్తారనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.

INDIA Alliance: ఇండియా కూటమి నేడు కీలక నిర్ణయం.. ఉపరాష్ట్రపతి రేస్‌లో ఎవరు ముందున్నారు?
India Alliance Vice President Candidate

దేశ రాజకీయాలు రోజు రోజుకు హాట్ హాట్‎గా మారుతున్నాయి. ఇండియా కూటమి నేతలు స్పీడ్ పెంచారు. ఈ రోజు ఉదయం తమ ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థి గురించి చర్చించబోతున్నారు. సోమవారం ఉదయం 10:15 గంటలకు రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ఆఫీస్‌లో ఈ సమావేశం జరగనుంది. ఇండియా కూటమిలోని ఫ్లోర్ లీడర్లు అంతా ఈ మీటింగ్‌లో పాల్గొనబోతున్నారు.

ఇటీవల ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా చేయడంతో, ఆ పదవికి కొత్త అభ్యర్థిని ఎన్నుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో నామినేషన్ చేయడానికి చివరి తేదీ ఆగస్ట్ 21 సమీపిస్తుండటంతో నేతలు సమాయత్తం అవుతున్నారు.


ఎన్డీఏ నుంచి రాధాకృష్ణన్

మరోవైపు అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) ఇప్పటికే తమ అభ్యర్థిని ప్రకటించింది. మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను ఎన్డీఏ తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టింది. రాధాకృష్ణన్ తమిళనాడు నుంచి వచ్చిన సీనియర్ బీజేపీ నేత, ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన వ్యక్తి. 2026లో తమిళనాడులో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ నామినేషన్ ద్వారా బీజేపీ తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా అధికార డీఎంకే నుంచి సపోర్ట్ పొందాలని భావిస్తోంది.

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆదివారం జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత ఈ నామినేషన్‌ను ప్రకటించారు. అంతేకాదు, ప్రతిపక్ష పార్టీలతో చర్చించి ఏకాభిప్రాయం కుదుర్చుకుంటామని కూడా అన్నారు.


ఇండియా కూటమి ఎవరిని ఎన్నుకుంటుంది?

ఇండియా కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలో ఈ ఎన్నిక కోసం ఒక రాజకీయేతర అభ్యర్థిని నిలబెట్టాలని ముందే నిర్ణయించింది. అంటే, రాజకీయ నేపథ్యం లేని వ్యక్తిని ఎంచుకునే అవకాశం ఉంది. కానీ, ఎవరిని ఎన్నుకోవాలి, ఎలా ముందుకు వెళ్లాలి అనేది ఈరోజు సమావేశంలో చర్చించనున్నారు. ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ నామినేషన్‌తో, ఇండియా కూటమి ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందో చూడాలి మరి. ఒకవేళ ఏకాభిప్రాయం కుదరకపోతే ఈ ఎన్నిక ఓ ఆసక్తికరమైన రాజకీయ పోరుగా మారే అవకాశం ఉంది.


ఏం జరగబోతోంది?

ఈ సమావేశం తర్వాత ఇండియా కూటమి తమ అభ్యర్థిని ప్రకటిస్తుందా? లేక ఎన్డీఏతో ఏకాభిప్రాయానికి వస్తుందా లేదా అనేది చూడాలి. తమిళనాడు నేపథ్యం ఉన్న రాధాకృష్ణన్ నామినేషన్ వల్ల డీఎంకే వంటి పార్టీలు ఎలాంటి స్టాండ్ తీసుకుంటాయనేది కూడా ఆసక్తికరంగా మారింది. మరి ఈరోజు జరిగే చర్చల్లో ఏం జరుగుతుందో, ఎవరు అభ్యర్థిగా ఎంపికవుతారో చూడాలి.


ఇవి కూడా చదవండి

డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 18 , 2025 | 07:30 AM