National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసు... హైకోర్టులో సవాలు చేసిన ఈడీ
ABN , Publish Date - Dec 19 , 2025 | 09:57 PM
నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన చార్జిషీటును పరిగణనలోకి తీసుకునేందుకు ఢిల్లీ కోర్టు గత మంగళవారంనాడు నిరాకరించింది. చార్జిషీటును తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ (National Herald Case) కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తదితరులపై మనీలాండరింగ్ ఫిర్యాదులను తోసిపుచ్చుతూ విచారణ కోర్టు ఇటీవల ఆదేశాలిచ్చింది. అయితే విచారణ కోర్టు ఉత్తర్వులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారంనాడు హైకోర్టులో సవాలు చేసింది. ఈ క్రిమినల్ రివిజన్ పిటిషన్ వచ్చే వారం లిస్టింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన చార్జిషీటును పరిగణనలోకి తీసుకునేందుకు ఢిల్లీ కోర్టు గత మంగళవారంనాడు నిరాకరించింది. చార్జిషీటును తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా కాకుండా, ప్రైవేటు వక్తి సుబ్రమణ్యం స్వామి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా చార్జిషీటును పరిగణనలోకి తీసుకోలేమని ఢిల్లీ కోర్టు ప్రత్యేక జడ్జి విశాల్ గాగ్నే తప్పుపట్టారు. చట్టం ప్రకారం దీన్ని విచారించడం సాధ్యం కాదన్నారు. ఢిల్లీ పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని ప్రత్యేక న్యాయమూర్తి గుర్తుచేశారు. అలాంటప్పుడు ఈడీ చార్జిషీటు ఆధారంగా తీర్పు ఇవ్వడం తొందరపాటే అవుతుందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ కేసులో ఈడీ దర్యాప్తును కొనసాగించవచ్చని కోర్టు ఆదేశాలిచ్చింది.
రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పుపై కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేసింది. ఈ కేసులో సోనియా, రాహుల్‌పై ఈడీ చర్యలు పూర్తిగా చట్టవిరుద్ధమని, దురుద్దేశంతో కూడుకున్నవని కోర్టు గుర్తించినట్టు పేర్కొంది. అయితే అభియోగాలను పరిగణలోకి తీసుకోలేదంటే సోనియా, రాహుల్‌కు క్లీన్ చిట్ ఇచ్చినట్టు కాదని బీజేపీ నేతలు స్పదించారు. ఈడీ సైతం ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని, ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మళ్లీ చార్జిషీటు దాఖలు చేస్తామని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
తమిళనాడులో 97 లక్షలు, గుజరాత్‌లో 73 లక్షల ఓట్లు తొలగింపు
రెండున్నరేళ్ల ఎగ్రిమెంట్ ఏమీ లేదు.. సిద్ధరామయ్య క్లారిటీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి