Election Commission: దేశవ్యాప్త ఎస్ఐఆర్ తొలివిడతపై ఈసీ కీలక మీడియా సమావేశం.. ఎప్పుడంటే
ABN , Publish Date - Oct 26 , 2025 | 09:01 PM
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో సాధ్యమైనంత త్వరగా ఎస్ఐఆర్‌ను పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అసోం, పుదుచ్చేరిలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నందున తొలి విడత ఎస్ఐఆర్‌లో ఆ రాష్ట్రాలు చోటుచేసుకోనున్నాయి.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR-Special Intensive Revision)కు భారత ఎన్నికల సంఘం (Election Commission of India) సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి సోమవారం మధ్యాహ్నం 4.15 గంటలకు ఎన్నికల కమిషన్ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తోంది. 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలతో సహా 10 నుంచి 15 రాష్ట్రాల్లో తొలి విడత ఎస్ఐఆర్ నిర్వహించే తేదీలను ఈసీ ఈ సందర్భంగా ప్రకటించే అవకాశం ఉంది.
తొలి విడత ఎస్ఐఆర్ రాష్ట్రాల్లో..
ఈసీ వర్గాల సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో సాధ్యమైనంత త్వరగా ఎస్ఐఆర్‌ను పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అసోం, పుదుచ్చేరిలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నందున తొలి విడత ఎస్ఐఆర్‌లో ఆ రాష్ట్రాలు చోటుచేసుకోనున్నాయి. అయితే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న, జరగడానికి సిద్ధంగా ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికల అధికారులు తలమునకలై ఉంటారు కావున వాటి జోలికి వెళ్లరాదని భావిస్తోంది.
బిహార్‌లో ఇటీవలే ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల కమిషన్ పూర్తి చేసి ఓటర్ల జాబితాను ప్రచురించింది. సెప్టెంబర్ 30వ తేదీ నాటికి తుది జాబితాలో 7.42 కోట్ల ఓటర్లు చోటుచేసుకున్నారు. నవంబర్ 6,11 తేదీల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇవి కూడా చదవండి..
ఛత్తీస్‌గఢ్‌లో 21 మంది మావోయిస్టుల లొంగుబాటు
సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలపై ఆగ్రహం.. టెర్రరిస్ట్ అని ప్రకటించిన పాక్..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి