DRDO: భారత్ కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పరీక్ష సక్సెస్..!
ABN , Publish Date - Aug 24 , 2025 | 02:44 PM
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) సైన్యం కోసం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఆయుధాలను సన్నద్ధం చేస్తోంది. తాజాగా ఒడిశా తీరంలో పరీక్షించిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ (IADWS) మొదటి విమాన పరీక్షను విజయవంతమైంది. ఈ విషయాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
భారత రక్షణ రంగం అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడేందుకు నిరంతరం అత్యాధునిక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అమ్ములపొదిలోకి చేర్చుకుంటోంది. తాజాగా భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఒడిశా తీరంలో అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ ఆయుధ వ్యవస్థ అయిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ (IADWS)ను విజయవంతంగా పరీక్షించింది. ఈ విషయాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా X వేదికగా ప్రకటించారు.
ఆగస్టు 23 అర్ధరాత్రి ఒడిశా తీర ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ (IADWS) మొదటి విమాన పరీక్ష విజయవంతంగా పూర్తయింది. IADWS అనేది బహుళ అంచెలు కలిగిన వాయు రక్షణ వ్యవస్థ. ఇందులో అన్ని స్వదేశీ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి (QRSAM), అడ్వాన్స్‌డ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (VSHORADs) క్షిపణులు, అధిక శక్తి గల లేజర్ ఆధారిత డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ (DEW) కీలకమైన ఉప వ్యవస్థలు ఉన్నాయి.
ఈ పరీక్ష విజయవంతంగా నిర్వహించిన డీఆర్‌డీవోపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎక్స్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. ట్యాగ్ చేసిన పోస్టులో 'IADWS బహుళ-అంచెల గగనతల రక్షణ వ్యవస్థ. శత్రు విమానాలు, క్షిపణుల ముప్పు నుంచి వ్యూహాత్మక ప్రాంతాలను కాపాడే సామర్థ్యం కలిగివున్నది. DRDO, మిలిటరీ బృందాలకు నా అభినందనలు' అని రాసుకొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రస్తావించిన ‘సుదర్శన చక్ర’ ఎయిర్ డిఫెన్స్ అభివృద్ధిపై ప్రకటన వెలువడిన కొన్ని రోజులకే ఈ IADWS పరీక్ష విజయవంతం కావడం గమనార్హం. అంతేకాక, కొద్దిరోజుల కిందటే భారత్ ‘అగ్ని-5’ అనే బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. దీని పరిధి సుమారు 5,000 కిలోమీటర్లు కాగా, మూడు అణు వార్‌హెడ్‌లు మోసుకెళ్లే సామర్థ్యం ఈ క్షిపణికి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
రాహుల్‌కి ముద్దు పెట్టిన యువకుడు.. చితక్కొట్టిన సిబ్బంది
For More National News And Telugu News